పుట:Kashi-Majili-Kathalu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయనుని కథ

దేవా! యవధరింపుము వైశంపాయనునితోఁగూడ మీరు మెల్లగా రండని మాకు జెప్పి దేవర యరిగితిరిగదా! ఆదినము మేము ప్రయాణసాధనముల సవరించుకొని మరునాఁ డుదయంబునఁ బ్రయాణభేరిని గొట్టించి నంతలో వైశంపాయనుండు వచ్చి వారించుచు నీప్రాంతమందచ్ఛోదమను పుణ్యసరస్సు గలదు. అందు దీధ౯మాడి శంభునర్చించి రేపుపోవుదము. ఈపుణ్యభూమి కిప్పుడైనను వత్తుమా? యని పలుకుచుఁ బదగమనముననే తానయ్యచ్ఛోదమునకుఁబోయెను.

ఆప్రదేశమంతయు రమణీయముగా నుండుటచే నందందు దృష్టి బరగింపుచు నందందు మెలంగుచు నవ్వనవిశేషములఁజూడఁ గ్రుమ్మరుచున్నంత నత్తటాకప్రాంతమున మణిశిలామంటపమొండు గనంబడినది.

దానిని జిరకాలమునకు గనంబడిన సోదరునివలెఁ బుత్రకుని భాతిమిత్రుని చందమున నత్యంతప్రీతితో రెప్పవాల్పక చూచుచు స్థంభితుని యట్ల కదలక నిర్వికారహృదయుఁ డై యెద్దియో థ్యానించుచు నథోముఖముకా నందుఁ గూర్చుండటయు మే మతనిం జూచి మనోహర దేశాలోకంబునం జేసి తదీయచిత్తమట్లు వికృతి బొందినదని తలంచి కొంతసే పూరకొంటిమి.

ఎప్పటికిని రాకున్న మేము దాపునకుఁ బోయి ఆర్యా! వేళ యతిక్రమించుచున్నది. స్నానము చేయుము. పయనమునకు సైనికులు మీరాక వేచియున్నారు. ఈప్రదేశ మెంతసేపు చూచినను జూడవలయుననియే యుండును. ఆలస్యము చేయక లెం డని పలికిన మామాటలు వినిపించుకొనక కదలక మాకేమియుఁ బ్రత్యుత్తరము జెప్పఁడయ్యెను. ఆ లతామంటపమును మాత్రము రెప్పవేయక నిశ్చల దృష్టితోఁ జూచుచుండెను.