పుట:Kashi-Majili-Kathalu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

కాదంబరి


కాదు. అబలాజనముయొక్క హృదయము మృదువైనను ముక్తాఫలత్వము నొందిన జలమువలె నుత్కంఠితమయి కఠినమగునని తలంచెదను. కానిచో నామెచిత్త మెన్ని వ్యసనములు జెందినను నశింపకున్నది. ఆహా! స్త్రీలకు వల్లభసమాగమాశ దురంతమయినదికాదా! అట్టి కష్టములతోడ నయిన బ్రాణముల ధరించియున్నది.

రాజకుమారా! అత్యుత్కటమైన యాకలకంటి యుత్కంఠ నీతో నేమి చెప్పుదును? ఏయుపాయంబునఁ బ్రదశి౯ంతును? దేనితోఁ బోల్చి చెప్పుదును? ఆమె తాపంబు ప్రచండ దినకర సహశ్రాతపమును మించియున్నది. శయనముగా వేఁయబడిన పద్మపత్రము లెండిచూణ౯ములై పోవుచున్నది. కామునిచే మధింపఁబడు నా యా చేష్టలం జేయుచున్నది. వినుండు మదనవేదన సహింపఁజాలక పరితపించుచుండి సఖులు కుసుమశయనంబునఁ బరుండఁబెట్టి కిసలయ తాళవృంతముల వీచుచు సంతాపముచేఁ జూణ౯మైన యలక్తకరసంబున నెఱ్ఱఁబడిన శయనకుసుమంబులం జూచి కుసుమశర ప్రహార జనిత రక్తమని యడలుచుందురు. మీపేరు తలపెట్టినంత మేనఁగవచమువలె రోమాంఛము వహించును. ఆమె యవస్థయంతయుం జెప్పుటకుఁ బది దినములు పట్టును. పెక్కులేలా? అక్కడి కథలన్నియుఁ ద్వదాలాపముఖరితములై యున్నవని యెఱింగించుటయుఁ జంద్రాపీడుఁడు కేయూరకా! చాలు చాలు. పైనఁ జెప్పకుము. వినలేకున్నానని పలుకుచుఁ గన్నులు మూసికొని మూర్ఛయావేశింపఁ గాదంబరిని ధ్యానించుచున్నవాఁడుం బోలె. ముహూత౯కాలము మేనెఱుంగక యంతలో దెలిసిగద్గదాక్షరముగా నతని కిట్లనియె.

కేయూరక! పత్రలేఖవలననే కాదంబరీ సంతాపమంతయుఁ దెలిసినది. నేనేమి చేయుదును? కాదంబరియొక్క యాజ్ఞనే నిందింపుము. అధరస్పందమాత్రముననే నియోగములను జేయుచున్న