పుట:Jyothishya shastramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విధానమని జ్ఞప్తికుంచుకోవలెను. ఇక్కడ జ్యోతిష్యులైన కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అది ఏమనగా! ‘‘మేము చదివిన జ్యోతిష్యశాస్త్రములో కేంద్రములు నాలుగు కలవనీ, అవియే 1,4,7,10 స్థానములనీ విన్నాము. మీరేమో కేంద్రములని పేరుపెట్టి 4,10 స్థానములను మాత్రము చెప్పు చున్నారు. ఒకటవ స్థానమును, ఏడవ స్థానమును మీరు వదలివేశారు. మిగతా గ్రంథములలో కేంద్రములు నాలుగు అని ఎందుకు చెప్పారు? మీరు రెండు మాత్రమే కలవని ఎందుకు చెప్పుచున్నారు?’’ అని అడుగ వచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఎవరు ఏ విధముగానైనా చెప్పవచ్చును. అయితే చెప్పబడిన విషయము సూత్రబద్ధముగా, శాస్త్రబద్ధముగా ఉండవలయును. మేము చెప్పినదానికి శాస్త్రము ఆధారముగాయున్నది. అలాగే జ్యోతిష్యశాస్త్రములో ఒక సూత్రమును చెప్పుచూ రెండు కేంద్రములను చెప్పాము. నాలుగు కేంద్రములు ఎట్లున్నవో? ఎలా ఉన్నవో? నాకు తెలియవు. నాలుగు కేంద్రములు అశాస్త్రీయమగును.

కొందరు వ్రాసిన జ్యోతిష్య గ్రంథములలో కోణములు మూడు యనీ, కేంద్రములు కూడా మూడుయనీ వ్రాసియుండుట మేము కూడా చూచాము. వారు ఒక సంస్కృత శ్లోకమును ఆధారముగా చెప్పుచూ ఫలానా శ్లోకములో ఇలాగ ఉన్నది. అందువలన కోణములు మూడు, కేంద్రములు మూడుయని చెప్పారు. అయితే వారు చూపిన శ్లోకము శాస్త్రబద్ధమైనదా కాదాయని వారు చూడలేదు. ఎవరో చెప్పిన దానిని గ్రుడ్డిగానమ్మి చెప్పడము జరిగినది. అలా నమ్మి చెప్పడమును మూఢనమ్మకము అని అనవచ్చును. ఇక్కడ మన బుద్ధిని ఉపయోగించి చూచినా మూడు స్థానములున్న దానిని కోణము అని అనవచ్చును. ఎప్పటికైనా మూడు స్థానములు కోణముగానే