పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 అందుకునే చంద్రయ్య కొడుకును ఊళ్ళో ఉన్న కిరస్తానీ బడికి పంపాడు. కిరస్తానీ బడుల ముఖ్యోద్దేశము కిరస్తానీ మతాన్ని కన్నీరుగా లోకంపై చల్లడమే. ఏది ఉద్దేశమయితేనేమి విద్య ఏదో రకంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం నీరు స్పష్టమయిన జలం కానేకాదు. ఏ పాఠశాలలో నయినా నిర్మల విద్యానీరాలు ప్రవహిస్తున్నాయి గనుకనా! స్థానిక ప్రభుత్వ సంస్థలు నెలకొల్పిన ప్రాథమిక పాఠశాలలోనూ అంతే, వీధులలోనూ అంతే!

పిపాసార్తునకు ఏజలమయినా అమృతమే! చదువుకుందామని బాలబాలికలకు ఉండనిమాట నిజమే! కాని వారి జీవితాలు వారికి తెలియకుండానే చదువుకోసం చేతులు చాచి ఉంటాయి. బడులకు పోయే బాలబాలికలు పాఠశాలలంటే కారాగృహాలన్నట్లు బెదిరిపోతారు. అయినా వారి మెదడులు ప్రతి జ్ఞాన లేశాన్నీ దాచుకుంటూనే ఉంటాయి.

మన ఎల్లమంద కిరస్తానీ పాఠశాలకు చిన్న మేకపిల్లలా వెళ్ళేవాడు. రోజురోజూ వాణ్ణి వాళ్ళమ్మ బడికి పంపించడం గండంగా ఉండేది. సోమమ్మకు ఎందుకు ఈ చదువో అర్థంకాలేదు. “సతుకులు సతికి ఎదవనాయాళ్ళూ కిరస్తానం అయిపోతారు.” అని ఆమె గోల. అందులో కుర్రవాణ్ణి పంపే బడి కిరస్తానీ బడి.

“కిరస్తానం అయితే ఏంటే!” అని క్రిష్టియన్ టీచరు గ్రేసమ్మ దెబ్బలాడేది. గ్రేసమ్మకు సోమమ్మకు హోరా హోరీ వాదన!

“మీరు పశువుల్లోంటి వోళ్లు! సచ్చిన గొడ్డుమాంసం తినే రాబందులు!”

“ఓసి! ఏడిశావులే! బ్రతికినదాని పేనం కసుక్కున నరికేసి తినే నక్కలు కారేంటి మీరు?”

ఎలాగయితే నేమి, ఎల్లమంద పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు నలుగురు. ప్రధానోపాధ్యాయుడు జీవానందం కరుణార్ద్ర హృదయుడు. నిజమయిన క్రిష్టియన్ మూర్తి. దయాంతఃకరణ ప్రవృత్తితో తన తోటి ఉపాధ్యాయులను, విద్యార్థులను తన బిడ్డలుగా చూచుకుంటాడు. అతడు క్రైస్తవగాథలు, బోధలు మహాభక్తుడై పులకలూరిపోతూ చెబుతాడు. అతడొక్కడే వేల కొలది మాలమాదిగలు అనబడే కులాల వారికి క్రైస్తవ మతదీక్ష ఇచ్చాడు. ఆయన ధర్మంలో ఎవరికీ బలవంతంగా మతదీక్ష ఇవ్వకూడదనీ, తిరిగి హిందూ మతంలోకి వెళ్ళదలచుకొన్న వారికి అడ్డం పెట్టకూడదనీ! .

చదువుకు కులం తేడాలు లేవు దారిలోపడితే ఆ చదువుల తల్లి అందరినీ సమాన ప్రేమతోనే చూస్తుంది. అసలు చదువువచ్చే ఘటం వేరు. కొందరు చదువుకుంటే వచ్చితీరే వారున్నారు. కొందరికి చదువుకుంటే, కష్టపడితే చదువు వస్తుంది. కొందరు కష్టపడి చదవకపోయినా ఆ మాయ చదువు ఎలా వస్తుందో వస్తుంది. కొందరు కష్టపడినా చదువు వస్తే వస్తుంది, రాకపోతే రాకపోవనూ వచ్చును. కాని కొందరు చదివేది, కుంభకోణ యోగం చేసేది, పుస్తకాల కంఠతా పట్టేది, చదువు చిరుదూరం దగ్గిరకన్నా రాదు.

ఎల్లమంద కష్టపడితే చదువు వచ్చే జాతివాడు. అలా కష్టపడుతున్నాడు, చదువు వస్తోంది.

అడివి బాపిరాజు రచనలు-7

6

నరుడు (సాంఘిక నవల)