పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్ళ ఊరయిన భీమవరం తాలూకా జక్కరం గ్రామం వదిలి భీమవరం మిషన్ హైస్కూలుకు వచ్చి చేరాడు. అక్కడ కొందరుపాధ్యాయులయిన క్రైస్తవమత ప్రచారకులున్నారు. వారు క్రైస్తవులు. కాని మాల మాదిగ కులాలవారు ఎలా చదువుతారు? వారికి చదువెందుకు? అని వాదించుకుంటూ ఉంటారు. కాని ప్రధానాచార్యులవారు మాత్రం “ఎవరయితేనేమి, ఇదివరకు చదువెరుగని కులాల వారందరూ చదువుకొనడం దేశాభ్యుదయ సూచన.” అని ఆనందం పడతారు.

ఎల్లమందను ప్రధానోపాధ్యాయులు అతి ప్రేమతో చూచి, అతనికి జిల్లా మునసబుగారు మొదలయిన వారిచేత సహాయం చేయించేవారు.

ఆ ఊళ్ళో ఉన్న బ్రహ్మసమాజంవారు, సత్సంగులు, కాంగ్రెసువారు ఎల్లమందకు ఎన్నో విధాల సహాయం చేశారు. ఆరేళ్ళు కష్టపడి చక్కని మార్కులు సంపాదించుకొని ఎల్లమంద 1930 సంవత్సరంలో స్కూలు ఫైనులు పరీక్ష నెగ్గినాడు.

అంతవరకు ఎల్లమందకు ఏమీ విచారంలేదు. రోజూ జక్కరం నుంచి నడిచి వచ్చేవాడు. సాయంకాలం నడిచే జక్కరం మాదిగగూడెం వెళ్ళిపోయేవాడు. తన గూడెంలో తానే చదువుకొనేవాడు.

అలా చదివి, చదివి, చివరకు తన పదునెనిమిదవ ఏటనే ఎల్లమంద స్కూలు ఫైనలు నెగ్గినాడు. తనవాడలో తానే చదువుకొనేవాడు. క్రైస్తవులలో ముగ్గురో నలుగురో చదువుకొనే బాలురూ, అయిదుగురో ఆరుగురో బాలికలూ ఉండేవారు.

ఆ బాలురూ, బాలికలూ మాల క్రైస్తవులు, మాదిగ క్రైస్తవులూ, కులాలు లేని మతమయినా - క్రైస్తవమతంలో కులాలు, జాతులు, రంగుల తేడాలు ఉన్నాయి. ఆ తేడాలేవీ ఎల్లమంద కంతగా తెలవవు. అతడు కష్టపడేవాడు, చదువుకునేవాడు.

ఒకరు బట్టలు కొని యిచ్చేవారు. ఒకరు హరికేన్ లాంతరు కొని ఇచ్చారు. చందాలవల్ల పుస్తకాలు వచ్చేయి. సగం జీతం. చందాల డబ్బు తండ్రి సంపాదనకు చన్నీళ్ళు వేన్నీళ్ళు కాగా, ఇంటిల్లపాదీ కొంచెం మంచిగుడ్డలు కట్టుకొని. కొంచెం శుభ్రమయిన తిండి తినగలుగుతున్నారు.

ఎల్లమందకు మంచి మార్కులు రావడంవల్ల రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో ఇంటరు తరగతిలో సీటు దొరికింది. విద్యార్థి వేతనమూ దొరికింది.

కళాశాల విద్య ప్రారంభించిన నాటనుండీ ఎల్లమందకు వేదన ప్రారంభించింది.

ఎల్లమంద అన్న పేరును అనేకులు విద్యార్థులు హేళన చేశేవారు.

“ఎక్కడిదిరా ఈ మంద?” “ఎల్లాం మందాం?” “ఏలరా ఈ మందా! చాలురా ఈ కందా!” ఈలా ఈలా అంటూ కొందరు విద్యార్థులు అతణ్ణి వేళాకోళాలు చేసేవారు.

అవి అంత అనిపించలేదు!

కాని ఒక బాలుడు ఒక రోజున, మీరే వర్ణస్థులండీ అని అడిగాడు.

“మేము మాదిగలం!” అని ఎల్లమంద జవాబు.

“మాదిగలా? అంటే, మాలవాళ్ళు కారూ? మాదిగలే!” అని ఆ బాలకుడు, కొంచెం దూరంగా జరిగాడు.

ఎల్లమంద హృదయం కుంగిపోయింది.

అడివి బాపిరాజు రచనలు - 7

7

నరుడు(సాంఘిక నవల)