పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నరుడు

.సాంఘిక నవల.

(మొదటి భాగం)

ఆ యువకుడు అలా ఎన్నిసార్లు కుళ్ళిపోయాడో చిన్నతనాన్నుంచీ అనంతమయిన ఆవేదనలతోనే అతని జీవితము ప్రవహించి వచ్చింది. వాళ్ళ ఊరి పురోహితుడు గారు “చదవడం మంచిదేరా ఎల్లమందా! కానీ నీ కులం సంగతి మరిచిపోకు,” అన్నారు.

ఆ పురోహితుడు సుబ్రహ్మణ్యం అవధానులుగారి దగ్గర వాళ్ళ తండ్రి పాలేరు. ఆ కుటుంబానికీ, ఈ కుటుంబానికీ ఎన్ని తరాలనుంచి సంబంధం ఉందో!

చంద్రయ్య మాదిగ కొడుకును చదువుకు పంపించాడు. చదువుకుందామని ఎల్లమందకు బుద్ధి కలగనేలేదు. చంద్రయ్యకూ కొడుకుకు చదువు చెప్పించాలని ఉద్దేశం మొదటలేదు.

చంద్రయ్య సాధారణ మాదిగకులం మనుష్యుడే అయినా అవధానులుగారి వేదాంత వాక్యాలు ఎప్పుడూ వింటూ ఉండేవాడు. ఉత్తమ వాక్యాలు వినగా వినగా రాయికన్నా సంస్కారం కలుగుతుంది. అవధానులుగారు అసలు వేదాంతం చంద్రిగాడికి చెప్పాడా? ఆయనకు వేదాంతం మాట్లాడడం అలవాటు. అవి ఆచరణలో పెడదామన్న భావానికీ, వేదాంత వాక్యాలు అంటూ ఉండడానికీ సంబంధం ఏమిటి? అవసరం వచ్చినప్పుడు ఏవో ముక్కలు అంటాం. అంతే వాని ఉపయోగం.

అయినా చంద్రయ్య మనస్సు నీటిని కోరే భూమిలా ఉన్నది. ఒక్క చుక్క నీరు పడినా, ఆ నేల ఆ చుక్కను పీల్చి దాచుకుంటూ ఉంది. అవధాన్లుగారు తెల్లవారగట్ల లేచి స్నానాదికాలు నిర్వర్తించి, సంధ్యావందనం పూర్తిచేసుకొని, పెద్ద గొంతుకలో ప్రాతస్మరామి శ్లోకాలు చదువుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేవాడు. చంద్రయ్యకు ఆ శ్లోకాలన్నీ కంఠతా వచ్చాయి.

ఇంటికి వచ్చిన వారితో, అవసరమున్న వారితో, అవసరం లేనివారితో, పొలానికి వచ్చినప్పుడు పాలేళ్ళతో, పక్క పొలం కమ్మవారి వెంకటరెడ్డితో వేదాంతం మాట్లాడుతూనే ఉంటారు అవధాన్లుగారు.

“సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త!”

“విద్య యొసగును వినయంబు! వినయమునను బడయుఁ బాత్రత!”

“జీవితం ఒక స్వప్నం వంటిదయ్యా!”

“జ్ఞానం లేని మనుష్యుడు పశువుతో సమానం!”

ఈలాంటి రత్నాలు అవధాన్లుగారి నోట ఎన్ని వస్తూ ఉండేవో! ఇవన్నీ మాదిగ చంద్రయ్య జీవితంలో అంకితమయిపోయాయి.

అడివి బాపిరాజు రచనలు-7
నరుడు(సాంఘిక నవల)
5