పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఏటింటాడో! సీమెల్లొచ్చాడు.ఆడికింత కూడెట్టవేం దైబమా!” అని ఎక్కి ఎక్కి రోదించింది తల్లి!

నెమ్మదిగా విన్నాడు ఎల్లమంద. “అమ్మా!” అని పిలిచాడు.

తల్లి పరుగున వచ్చి “ఏటి బాబో!" అని అడిగింది చిరుగుల చీరకొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ. తల్లిని తన మంచం మీద కూర్చోబెట్టి ఎల్లమంద “అమ్మా! నేను సీమ వెళ్ళి రావడంవల్ల ఈ విధంగా అవలేదు. నాకు తిండి సయించక పోవడమూ, దానివల్ల కాదు. నాకు సయించే తిండి పెట్టలేకపోతే మీ తప్పేమి ఉంది. కాని అసలు మన మాదిగ కులంవాళ్ళూ, అలాంటి నీచస్థితిలో వున్న మాలలు, ఇతర చోట్లవున్న మనబోటి వాళ్ళూ అనుభవించే పరమ అసహ్యకరమైన, భరించలేని బాధలు నా మనస్సును వికలం చేశాయి. అందుకు తిండి సయించలేదు. ఇప్పుడు బాగా ఆకలివేస్తూ ఉంది. తీసుకురా అన్నీ.” అని నవ్వుతూ వీపు తట్టినాడు.

ఆ వెర్రిబాగుల తల్లి ఒక్క గంతు వేసింది గుడిసెలోకి. ఈ బాలకుడు వస్తున్నాడని తమ చుట్టాలల్లా కిరస్తానీ మతం పుచ్చుకొని దొరల దగ్గిర బట్లరు పని చేస్తున్న జకరయ్య, దొరసానమ్మ నడిగి ఒక సెట్టు పింగాణీ గిన్నెలు వగయిరాలన్నీ పట్టుకువచ్చాడు. ఒక దాంట్లో బజారులో కొన్న నాను రొట్టె, ఒక దాంట్లో మాంసం కూరా, ఇంకో దాంట్లో అన్నం, మరో దానిలో పులుసూ మొదలయినవన్నీ పట్టుకువచ్చి మంచం దాపున వున్న బల్లపైన పెట్టింది.

మనస్సు నిర్మల మయిపోవడంచేత కడుపునిండా భోజనం చేస్తూ, ఎల్లమంద తల్లిని ఎంతో మెచ్చుకున్నాడు. తల్లి వెంకమ్మ ఎంతో సంతోషించింది.

అతనికి తన చిన్ననాటి భోజనం జ్ఞాపకం వచ్చింది. మూకుడులో గంజి, నాలుగు మెతుకులూ, ఉప్పు చేత నంజుకోవడమూ, అంతే భోజనం. ఉప్పుగల్లే షడ్రుచులు సంతకని తల్లి బుధవారంనాడు చిప్పలో పెట్టుకున్న ఆరణాల డబ్బులు అంటే ఆరణాల డబ్బులే రొంటిని ముడేసుకొని భీమవరం పోయేది.

అర్ధణా డబ్బులు ఎండు మిరపకాయలు, మూడు కాన్లు ఉప్పు, ఒక అర్ధణా వంకాయలు, కందిపప్పు అణా, ఘరంమసాలా అర్ధణా, కొబ్బరి నూనె అర్ధణా, వేరుశనగనూనే అర్ధణా, ఉప్పుచేపలు అణా, ఒక కాని దుంపలపోగు, పందిమాంసం అర్ధణా ఇదీ సంత ఖర్చు. ఈ కోటీశ్వరులకీ సంత ఖర్చుతో వారం అంతా గడవాలి. ఖామందుల ఇంటిలో ఏదైనా పండగా పబ్బమూ, శుభకార్యమూ వగయిరాలు వస్తే ఆ రోజు ఇంటిల్లిపాదీ కాస్త రుచులు చూస్తూ కడుపునిండా తింటారు.

ఖామందులు సుబ్రహ్మణ్యశాస్త్రులుగారు కాస్త డబ్బూ ఆస్తి ఉన్నవాడవటంచేతా, పదిమంది పిల్లలుగల వాడవటంచేతా వారింటిలో ఏవో శుభకార్యాలు వస్తూనే ఉంటాయి. ఆ శుభకార్యాల సమయంలో సాయంకాలం ఆకుల్లో పెట్టి కులం పాలేరువాళ్ళు ఇంటికి బైటదొడ్డిలో గడ్డి మేటికి యివతలగా పదిమందికి సరిపోయే అన్నం, పప్పు, రెండు కూరలు, పులుసు, రెండు పచ్చళ్ళు, పిండివంట రకాలూ పెడితే వెంకో, చంద్రయ్యో మూటలు కట్టుకొని ఇళ్ళకు తీసుకుపోతారు.

అడివి బాపిరాజు రచనలు - 7

50

నరుడు(సాంఘిక నవల)