పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ మధ్యాహ్నం యెల్లమంద జక్కరం చేరినాడు. తన గుడిసె దగ్గిరకు వెళ్ళాడు. గుడిసెముందు పెద్దపందిరి. తోరణాలు, పందిరిలో కుర్చీలు, బల్లలు, మంచం, పరుపుదిండ్లు వున్నాయి. పరుపులు వేసిన మంచం చుట్టూ మూడు వెదురు తడికలు కట్టి ఒక గదిలా సిద్ధం చేశారు.

ఆ గూడెంలో దొరలు జీవించే విధానం ఎరిగివున్న క్రిష్టియనులు వున్నారు. వాళ్ళ సహాయంవల్ల చంద్రయ్య ఈ ఏర్పాటులు చేశాడు. తండ్రి ఆపేక్ష అనంతం! తల్లి ఆపేక్ష అనంతత్వానికి అవధి ఇవ్వగలదు! వారి ప్రేమ మధ్య అలాంటి ప్రదేశంలో ఇంగ్లండులో డి.యస్.సి ఇంజనీరింగు నెగ్గి అమెరికా వెళ్ళి రెండేళ్ళు ప్రవాహశక్తి జనిత విద్యుచ్ఛక్తిని గురించీ, ప్రవాహశక్తిని గురించీ నేర్చుకొని, విజయ పత్రాలు పొందిన ఎల్లమంద తడికెల పందిరి క్రింద మకాము.

తన అక్కచెల్లెండ్రు, అన్నదమ్ములు అతి విచిత్రంగా చూస్తున్నారు. ఈ మనుష్యుల అతి ప్రాథమిక జీవితం, ఒకే గుడిసెలో అందరూ పడుకోడం! ఇతరులు వున్నారని లేకుండా స్త్రీ పురుష సంగమక్రియ! యెంతటి నీచగతి!

ఏ పాపం చేశావు నా జాతీ!

ఎన్ని వేల సంవత్సరాలు ఈ భయంకర నీచస్థితిలో కుళ్ళిపోతూ ఉంటావు మాదిగవాడా?

నీకు విముక్తి లేదా?

ఎంతటి దీన చరిత్ర జరిగిపోతోంది!

తిండి లేకుండా!

మొండితనం కప్పే బట్ట లేకుండా!!

పండ పక్క లేకుండా!!!

ఉత్తమ జీవితం ఛాయలన్నా సోకకుండా, సత్తువలేని హృదయాలు స్వంతంలేని మనస్సులు, మత్తువాసన, కుళ్ళిన మాంసం వాసన హీనత్వం, లుకలుకలాడే భయంకర వాసన, వైద్యుణ్ణి, గురువునూ యెరుగని బీభత్సం. సేద్యం యెరుగని అడవి భూములకన్న హీనమే!

నా జాతీ!

నా మాదిగ జాతీ!

ఆశలేని భయంకరావస్థల క్రుంగే జాతీ!

ఏనాటికి నీకు ముక్తి?

ఏనాటికి నీకు ఏడుగడ?

అతడు వెక్కి వెక్కి రోదించాడు. తల్లితో తిండి సహించలేదని ఆ రాత్రే అలాగే పడుకున్నాడు.

గుడిసెలో తల్లీ తండ్రీ, మన తిండి వాడికి ఏం సయిస్తుంది, అనుకుంటున్నారు. తల్లి నెమ్మదిగా ఏడ్చింది.

“ఊరుకో నాయాలా! ఆడింటాడు,” అని తండ్రి.

అడివి బాపిరాజు రచనలు - 7

49

నరుడు(సాంఘిక నవల)