పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నువ్వా! ప్రపంచములో ఒక్క బాలికన్నా నీ ఎదుట తగుదునని సౌందర్యం విషయంలో నిలవగలదా జెన్నీ?”

“బడాయి పొగడ్త!”

“పొగడ్తా! కాని నా వంటి శుద్ద నీగ్రో మాటో?”

కారు ఆపుచేసి, “నన్ను అలా అవమానించినందుకు చూడు ఏం చేస్తానో?”

“నిన్ను అవమానించడమా?”

“అవును! నా ప్రియతముణ్ణి నీగ్రో అంటావా దుర్మార్గుడా!”

“ఇంత చదువుకున్నవాడవు శాస్త్రజ్ఞుడవు, శాస్త్ర పరిశోధకుడవు, నువ్వు కూడా ఏదో పారలౌకిక సంబంధమైన మాటలంటావేమి మూర్తీ?”

“నువ్వు దేవకన్యవు. దేవకన్యల ఎదుట ప్రాపంచికపు మాటలు ఎలా వస్తాయి?”

“నన్ను పొగడకు. సంపూర్ణంగా ప్రాపంచిక వాసనలలో మునిగివున్న దానిని నేను.”

“అది నమ్మమనేనా నీ ఉద్దేశం?”

“ఆ!”

“అయితే నువ్వు నన్నెలా ప్రేమించగలిగావు?”

“అమెరికా వెళ్ళి పెద్ద విద్య నేర్చుకు వచ్చిన మొనగాడవు!”

“అవును! భారతదేశంలో అతి నికృష్ణ సంఘానికి చెందిన హీనుణ్ణి!”

వారిద్దరూ పకపక నవ్వుకున్నారు.

ఆ వెన్నెలలో ఆమె అతని ఒడిలోకి ఒక వాగు ఇంకో వాగులోనికి ఒదిగినట్లు వాలిపోయినది. అతడామెను తన హృదయాన బిగియార కౌగలించుకొని, అమిత భక్తితో ప్రణయంతో, ఆనందావేశంతో ఆమె మోము, జుట్టు, కన్నులు, చెవులు, మెడ, వక్షసీమ, భుజములు ముద్దు పెట్టుకున్నాడు.

వారు ఒకరి నొకరు చూచుకుంటారు. పిచ్చిమాటలు పలుకుకుంటారు.

ఇంతలో ఇద్దరికీ ఒక్కసారే లయొనెల్ జ్ఞాపకం వచ్చినాడు.

ఇద్దరూ చటుక్కున లేచి ఒకరి నడుంచుట్టూ ఒకరు చేతులు అదిమిపట్టి రోడ్డుమీద ఉన్న కారుకడకు పరుగుపెట్టారు. కారులో ఎక్కి కానొమెరాకు చక్కా వచ్చారు.

కారుదిగి ఇద్దరూ తిన్నగా నాట్యంచేసే మందిరంలోకి పోయేసరికి లయొనెల్ నిలుచుండి, సోఫాపై కూర్చున్న భార్యతో ఏదో వాదిస్తున్నాడు.

ఎలిజబెత్తు గుమ్మంలో వచ్చే ఈ యువజంటను చూచి "అరుగో వస్తున్నారన్నది!” ఆమె భర్త తిరిగి, వీరిద్దరిని చూచి గబగబ రెండంగలలో వీరిద్దరికడకూ వచ్చినాడు. చిరునవ్వు నవ్వుతూ వీరిని చేరి, వారి మోములు చూచి, వారి ఫాలాలలో నృత్యం చేస్తున్న కాంతులు చూచి, వారి రహస్యము చటుక్కున గ్రహించినాడు.

తడబడుతూ ఎల్లమందమూర్తి “లయో! నీ... నీ... సోదరి నన్ను ధన్యుణ్ణి చేసింది. నన్ను వివాహం జేసుకోడానికి ఒప్పుకుంది. నీ అనుమతి... అనుమతి ఇవ్వ ప్రార్ధిస్తున్నాను!” అన్నాడు.


అడివి బాపిరాజు రచనలు - 7

42

నరుడు(సాంఘిక నవల)