పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 వారు కౌగిలింత విడినారు. అతడు వణికే కంఠంతో “జెన్నీ, నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగాడు.

ఆమె మాట్లాడక అతని మెడచుట్టూ చేయి వైచి తల వంచుకొని అతని పెదవులను ముద్దుపెట్టుకుంటూ ఉప్పొంగే తన అధరాన్ని అతని విశాల వక్షానికి అదిమివేసి “నీకోసం, నీకోసం ఇన్నేళ్ళు కనిపెట్టుకుని ఉన్నాను!” అన్నది.

ఆ సమయం అయిన్‌స్టెయిను రెలెటివిటీ సిద్ధాంతాన్ని మించిన సమయం.

ఆ సమయంలో మనుష్యుడు అన్ని స్థితులను దాటిన దివ్యస్థితిలో ఉంటాడు.

“నేను ఎంతో అదృష్టవంతుణ్ణి జెన్నీ!”

“నేను అదృష్టవంతురాలిని మూర్తీ!”

“నేను నికృష్టుడయిన హిందూజాతి అధమ సంఘానికి చెందినవాణ్ణి!”

“మా సంఘానికి ఏ స్థితీ లేదు మూర్తీ!”

“నువ్వు దేవకన్యవు!”

“అది వట్టి పొగడ్త!”

“నన్ను గురించి ఏమీ ఎరగవు, ఎలా నన్ను ప్రేమించగలిగావు?”

“నిన్ను గురించి నాకు తెలిసినంత నీకే తెలియదు!”

“నేను ఈ దేశం వచ్చి కొద్దిరోజులే అయింది.”

“నిన్ను ఏళ్ళ తరబడి ఎరుగుదును.”

“ఈ నా ప్రేమ -”

“నీ ప్రేమ కాదు - మన ప్రేమ!”

“మన ప్రేమ విషయం మీ తల్లితండ్రులూ, లయొనెలూ విని ఏమంటారు?”

“నా అంత అదృష్టవంతురాలు లేదంటారు?”

వారిద్దరూ మరీ మరీ గాఢంగా అదిమి వేసికొన్నారు.

“రా! మూర్తీ, నా దివ్యభర్తా! రా! మళ్ళీ ఆ నాట్యంలోకి వెళ్ళలేను. మనం ఏ చక్కని ప్రదేశానికైనా పోయి అక్కడ ఏవో మధురమయిన, పిచ్చివైన అత్యంతార్థవంతాలయిన మాటలు చెప్పుకుందాము! రా!” అని జెన్నీ అన్నది.

అతడు లేచి, ప్రణయసరస్నాతుడయిన వానివలె జెన్నీని తన కదిమికొని ముద్దులిచ్చి ఆమె కారుకడకు కొని పోయినాడు. వారిద్దరూ అప్పుడే పన్నెండు కొట్టినదని, తెలుసుకొని, రెండు గంటల కాలంవరకూ సముద్రతీరం వరకూ వెళ్ళివద్దామనుకున్నారు.

5

ఆమె తన కారు నడుపుకొంటూ అతన్ని తీసుకుపోయినది. తన కారు నడిపేవానితో అక్కడే ఉండమనిన్నీ, తన అన్నగారు అడిగితే ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వెళ్ళినారనీ చెప్పమని వారు బయలుదేరినారు.

ఆమె ప్రక్కనే అతడు అధివసించి ఉన్నాడు. ఆమె “నేను అందమయినదాననేనా మూర్తీ?” అని అడిగింది.


అడివి బాపిరాజు రచనలు - 7

41

నరుడు(సాంఘిక నవల)