పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంటనే లయొనెల్ మూర్తి చేయి దొరకపుచ్చుకొని, జాడించి, “నా అభినందనాలు, మూర్తీ! ఈ పవిత్ర క్షణంకోసం కలలు కన్నాను. కోరాను, భగవంతుణ్ణి ప్రార్థించాను. అలాంటిది నా అనుమతెందుకూ అనుమతి అయిదేళ్ళ క్రిందటే ఇచ్చాను,” అన్నాడు.

చెల్లెలిని దగ్గరకు తీసుకొని, ఆమెను నుదురుపై ముద్దిడి, “రండి! విజ్జీకి చెబుదాము!” అని మూర్తివైపు తిరిగి, నువ్వు విజ్జీతో ఈ నాట్యంలో పాల్గొనవలసి ఉంది. నువ్వు సమయానికి లేక ఎక్కడికో వెళ్ళిపోయావని, ఆమెగారికి కోపం వస్తే, నేను నీ తరపున క్షమాపణ అడుగుతున్నాను.” అన్నాడు.

మూర్తి తెల్లబోతూనే ఎలిజబెత్ కూర్చున్న తావుకు వెళ్ళి “ఎలిజిబెత్! నన్ను క్షమించాలి! నేనూ జెన్నీ కలిసి సముద్రం ఒడ్డుకు వెళ్ళాము. జెన్నీ నన్ను వివాహం చేసుకొని నా జన్మ పవిత్రం చేయడానికి ఒప్పుకొంది! ఆ విషయం మాట్లాడుకొంటూంటే ఆలస్యమయింది. నన్ను క్షమించమనీ, మా ఇద్దరినీ అభినందించమనీ ప్రార్థిస్తున్నాను.” అని చేయి చాపినాడు.

ఎలిజబెత్తు ముఖంలో కోపకాంతులు మాయంకాలేదు. ముందుకు చాపిన అతని చేతిని ఆమె గమనించదలచకోలేదు. “నువ్వు క్షమాపణ అడగనక్కరలేదు, నీ నాట్యం లేకపోయినందువల్ల నా మనస్సు ఏమీ కలతపొందలేదు! కాని నా మాట జెన్నీ వినేటట్లయితే ఒక నిగ్గర్ను పెళ్ళి చేసుకోవద్దని ఆమెకు నా హృదయపూర్వకమైన సలహాయిస్తున్నాను. అని లేచి, భర్తవైపు తిరిగి నాకు తలనొప్పిగా ఉంది. ఇంటికి పోవాలి!” అని బయలుదేరింది.

వారందరి మధ్యా ఒక పిడుగు పడింది. మూర్తికి వేయి బాంబులు మీద పడినట్లయింది. అతని హృదయంలోని రక్తం మాయమై స్పందనమాగిపోయింది.

లయొనెల్ నోటమాటలేదు. అతడు చైతన్యముడిగి అలాగే నిలుచుండిపోయినాడు. కాని జెన్నీ మొదట ఒక నిముషం ఆశ్చర్యంతో, తర్వాత కిలకిలనవ్వి.

“అన్నా! ఎలిజబెత్తు చిన్న బిడ్డ! పో ఆమెను సముదాయించు. మేం ఇద్దరం ఇక్కడే తోటలో ఒక గంటసేపు కూర్చుంటాము. తర్వాత ఇంటికి వస్తాను” అని అన్నగారిని తోసింది. లయొనెల్ మూర్తి రెండు చేతులు పట్టుకొని. విజ్జి తరఫున ప్రార్థిస్తున్నాను. ఆమెను నన్ను క్షమించు మూర్తీ!” అని దీనంగా వేడుకున్నాడు.

మూర్తి కన్నులు మెరిసినాయి. స్నేహితుని చేతులు గట్టిగా పట్టుకొని, ఈరోజు వచ్చినాను. ఒక్క రోజలో నా చరిత్ర పదియుగాల చరిత్రై నడిచింది. నా హృదయ పూర్వకంగా ఎలిజబెత్తును క్షమాపణ వేడుకుంటున్నాను.” అన్నాడు.

లయొనెల్ తమ కారులో కూర్చుని ఉన్న భార్య దగ్గరకు వెళ్ళిపోయినాడు.

ఎల్లమందమూర్తి చేయి పట్టుకొని జెన్నీ, “రా ప్రియతమా! ఇటలీ విరుచుకుపడితే, అబ్సీనియా పెట్టిన మోము ధరించావేమిటి? రా!” అని అతనిని తోటలోనికి తీసుకు పోయింది.

తోటలో మునుపు కూర్చుండిన బెంచిమీదే వారిద్దరూ కూర్చున్నారు.

“మూర్తి నేను డాక్టర్ను!”

“నేను నీ విషయం అంతా అడుగుదామనుకుంటున్నాను.”


అడివి బాపిరాజు రచనలు - 7

43

నరుడు(సాంఘిక నవల)