పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లయొనెల్ తిరుచునాపల్లి పోయి చార్జి పుచ్చుకోక మునుపు, ప్రతిరోజూ జెన్నీ అన్నగారిని కలుసుకొనేది. లయొనెల్ దంపతులు జెన్నీ ఇంటికి వచ్చేవారు - లేదా జెన్నీ కానొమేరాకు పోయేది. లయనెల్ వైద్య కళాశాలలో జెన్నీని కలుసుకొనేవాడు.

ఈలా కలుసుకొన్నప్పుడెల్లా “ఎల్లమందమూర్తి”ని గురించి సంభాషణలు వచ్చేవి.

“జెన్నీ! మూర్తి హృదయం చాలా విచిత్రమయింది. ఈ దేశంలో హిందూ సంఘంలో అతి నీచస్థితిలో ఉన్న కులాలల్లో ఒకదానిలో ఉద్భవించాడతడు!”

“అతడు చదువుకోడం ఎలా సంభవించింది?”

“అది విచిత్ర సంఘటన! భగవంతుడుంటే - ఉన్నాడని నాకు పూర్తి నమ్మకం కుదిరింది. జెన్నీ - అతడే మూర్తిని చదువుదారిలో పెట్టి ఉండాలి. ఇంక విద్యాసోపానాలు ఎక్కడం ప్రారంభించాడు.”

“అతను చదువుకి ఇంగ్లండు రావడం ఏలా సంభవించింది?”

“అలాంటి వారికైనా వస్తాయి అవకాశాలు లేదూ, లక్షాధికారులకు వస్తాయి.”

“అతడు ఇంగ్లండులో ఎలా ఉండేవాడు?”

“ఇద్దరం ఒకేసారి లండనులోని ఇంజనీరింగు కళాశాలలో చేరినాము. ఇంకేం కావాలి? ఇద్దరం తారసిల్లాము. అతడు నీటిని వదలిన చేపలా ఉన్నాడు. ఎల్లా ప్రయాణం చేసి వచ్చాడో ఏమో కాని, ఉత్సవంలో తప్పిపోయిన బాలకునిలా కంగారుపడుతూ అప్పుడే చేరి ఆఫీసు గుమాస్తాల గది ముందున్న ప్రాంగణంలో తెల్లబోతూ నిలుచున్నాడు. నేను చేయవలసిన తంతంతా నెరవేర్చి బయటకు వచ్చాను. అతడు కనబడ్డాడు. విశిష్టమయిన అతని మోము చూచి జాలి వేసింది. అతని దగ్గరకు వెళ్ళి, “ఏమండి! మీరు ఫలానా ఓడలో మొదటి తరగతిలో ప్రయాణం చేస్తున్న వారిలో వొకరు కాదా?” అని ప్రశ్నించాను.

“అవును... కాదు... ఏమిటి... ఏమిటంటే? ఓడ... అ... దే కాని మొదటి తరగతిలో కాదు, నేను ప్రయాణం చేసింది రెండవ తరగతిలోనండీ!” అన్నాడు.

“అదే అయి ఉంటుంది; నాకు జ్ఞాపకం లేదు,” అన్నాను.

“నా పేరు మూర్తి. మాది పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం గ్రామంవద్ద జక్కరం గ్రామం.

“ఇక్కడకు వచ్చారేం?”

“ఈ ఇంజనీరింగు కళాశాలలో చేరాలని వచ్చాను!”

“ఏమిటీ?”

“అవునండీ.”

“చాలా సంతోషం. మాది మదరాసు. నా పేరు లయొనెల్. నేను ఇప్పుడే చేరనాను, ఈ కళాశాలలో!”

“మీ... మీ... ది... ఈ దేశం మీ - అంటే మీరు ఈ దేశ నివాసులనుకున్నాను ”

అలా అనుకోకండి. నేనూ మీ దేశం వాణ్ణి!”

అక్కడనుండి నాకూ మూర్తికి స్నేహం ప్రారంభం అయింది.

అడివి బాపిరాజు రచనలు - 7

33

నరుడు(సాంఘిక నవల)