పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“లయెనెల్! మూర్తీ, నువ్వూ ఈ దేశంలో ఇంజనీరింగు కళాశాలలో చదువుతూ వుంటే స్నేహం చేసి ఉందువా?”

“ఏమో చెప్పలేను! దేశం వదలి పరదేశాలకు వెడితే ఏలాంటి వాడైనా మనదేశం వారితో ఎక్కువ సన్నిహిత సంబంధం కలుగుతుంది గదా జెన్నీ!”

“అవునులే; అయితే మూర్తి అక్కడ ఎలా ఉండేవాడు?”

“ఎప్పుడూ ఆలోచన! తన సంఘం అంత నికృష్ట స్థితిలో ఉండడానికి తామే కారణం అనీ, ఏనాటికైనా తామే పెద్దకులాలవారి ముక్కులు గుద్ది వారితో సమత్వం సంపాదించుకోవాలని వాదించేవాడు.”

“అంతేకాని, పైకులాలవారి వైద్య ప్రాబల్యంవల్ల తమకా హీనస్థితి వచ్చిందని వాదించేవాడు కాదా?”

“జెన్నీ, వాళ్ళ కులం వాళ్ళ స్థితి అతను వర్ణిస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది.”

“అవును లయొనెల్! మనదేశంలో బీదవాళ్ళ స్థితి భరించరానిదే!”

“మన దేశం అంటావు. ఏ దేశమయినా అంతే! ఒక్క రష్యాలో తప్ప తక్కిన అన్ని దేశాలలోను బీదవాళ్ళ స్థితి అంతే!”

“కాని ఇతర దేశాలలో బీదవాళ్ళు భాగ్యవంతులు కావచ్చును. ఈ దేశంలో హిందూమతంలో కొన్ని కులాల వారు ఎప్పటికీ పైకి వెళ్ళడానికి వీళ్ళు లేనేలేవు.”

జెన్నీ ఆలోచనా పరురాలయినది. మూర్తి! మూర్తి!! ఏ పూర్వానుబంధమో ఎవరికి తెలుస్తుంది? మూర్తి విషయం అంతా కనుక్కుని "తెలుసుకోవాలని బుద్ది కలగడమేమిటి?


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

34

నరుడు(సాంఘిక నవల)