పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలికలూ కూలిపని మానివేసి చదవాలి. ఉద్యోగాలివ్వడంలో ప్రభుత్వంవారే హరిజనుల వంతు ఎక్కువ చెయ్యాలి.

అంబేద్కరుగారు ఇతర మతం పుచ్చుకొంటే కొంత నయిం అని తక్కిన కులాలవారిమీద కోపంతో అన్నారు. తమ మాల మాదిగ, పెరియా దోబీ, మాలార్ మొదలగు కులాల వారందరూ ఇతర మతాలు పుచ్చుకొంటే ఈ సమస్యా పరిష్కారం దొడ్డిదారే అవుతుంది. క్రైస్తవులైతే మాత్రం పాశ్చాత్యులతో సమానం ఔతారా? ముస్లింలు ఔతే నవాబులతో, కోటీశ్వరులతో సమానం ఔతారా?

అమెరికాలో నీగ్రోలందరూ క్రైస్తవమతం పుచ్చుకున్నారు. అంతమాత్రాన వారి విషమ సమస్య తీరిందా! కులాలు లేవనుకొన్న జాతులలో కులం ఇంకోరీతిగా పరిణమిస్తుంది. అన్నిటికన్నా రష్యా నయం. రష్యాలో ప్రతి మనుష్యుడూ పైకి వెళ్ళడానికి వీలుంది. అందరూ ఒక్కటే అక్కడ. ఆ మహత్తు బోల్సివిజంలో ఉంది కాబోలు. అయినా అక్కడ కులతత్వం ఇంకోరీతిగా తలెత్తుతుంది. బోల్షివిక్కులు కాని వారిని వారు మాదిగవారితో సమానంగా చూస్తారు. ఒక్కొక్కరకం పనిచేసేవారు ఒక్కొక్క రకం కులం అవుతారు. కులతత్వం మానవజాతిలోనే ఉంది కాబోలు. |

ఎల్లమందకు తన గుడిసెలో నిదురపట్టదు. తనొక్కడూ పెద్ద ఉద్యోగానికి ప్రయత్నం చేసినంత మాత్రాన ఈ గూడెం అల్లావుద్దీను మాయ సెమ్మా తిప్పితే మారినట్లు లండను పికాడెల్లీ సర్కసు అవుతుందా?

రాజమండ్రి హాస్టలు భోజనాలు తన ఇంటి దగ్గర ఏవి? అతడు రహస్యంగా కంటినీరు కుక్కుకున్నాడు.

తనకు నాల్గేళ్ళపాటైనా భోజనాలు దొరికాయి. తన వారికేవి? తన గూడెంవారి కేవి ఆ భోజనాలు? తను హాస్టలులో ఉన్నంతకాలం హరిజన సంఘంవారు తనకు కొని ఇచ్చిన కాంపు కాటుమీద, పరుపుమీదా పండుకొనేవాడు. ఇంటిదగ్గిర తన వాళ్ళెవ్వరికీ లేని భోగాలు తనకెందుకు?

మహాత్మాగాంధీ తన జాతికోసం ఎన్నిసార్లు నిరసన వ్రతం చేసినారో! తక్కిన హిందువుల హృదయంలోంచి, వారి భావనలోంచి, వీరు అంటరానివారు, చూడరానివారు అనే భావం తీసివేయగలరా?

తమకు దేవాలయ ప్రవేశం లేదు. దేవాలయంలోనే దేవుడుండి, ఇంకోచోట లేడనా? కావలసిన వారికి భగవంతుడు ఎక్కడ బడితే అక్కడే వున్నాడు. అసలు ఉన్నాడో లేడో? ఇంతకూ నువ్వు దేవాలయంలోనికి రాకూడదు అని ఒక కులాన్ని అరికట్టడంలో ఉన్న అగౌరవం అనంతం.

దేవాలయం ఇవతల భగవంతుడు తమ్ము అంటుకుంటే మైల బడిపోతాడా! మంత్రాలు పాడు నోళ్ళల్లోనే ఉంటాయా? మంత్రం కూడా భగవంతుని రూపం కదా అదీ సర్వత్ర నిండి ఉండవలసింది కదా!

ఎవరు తనకు సలహా చెప్పేది? ఎవరు తనకు దారి చూపేది. కాంగ్రెసు వారి నడిగితే, దేశసేవ చేయమంటారు. ఇతరులను అడిగితే ప్రభుత్వోద్యోగం చేయమంటారు.


అడివి బాపిరాజు రచనలు - 7

18

నరుడు(సాంఘిక నవల)