పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికన్ మిషనరీదొర: ఏమయ్యా! నీ పేరు ఏమి బాగుంది? పేరు మంచిది ఈయలేని మతం ఓ మతమేనా?

ఎల్లమంద: మీరేమి పేరు యిస్తారు? నెతానియేలు, దానిఏలు, జార్జి, ఎడ్వర్దూ, ఇసాఏలు, ఈశయ్య, మోసేయి, సామ్యుయేలు, కృపాదానం, దేవదానం, సత్యానందం ఈలా ఈలా ఉంటాయి. ఎల్లమంద కోటప్పకొండకు మా తలితండ్రులు బిడ్డలు పుట్టక మొక్కుకుని వెళ్ళారు. అక్కడ నుంచి వచ్చాక నేను కడుపున పడ్డాను. నా పేరు ఎల్లమంద అని పెట్టాడు మా తండ్రి. మీకు మైకేలు ఎంతో మాకు ఎల్లమందా అంతే.

ఆమె: పేరు సంగతి అల్లా ఉంచు. మీ వాళ్ళు రాళ్ళూ రప్పలకు మొక్కుతారు. జంతువుల్ని పూజిస్తారు. మా వాళ్ళు యేకేశ్వరుడయిన భగవంతునే పూజిస్తారు.

ఎల్ల: అయ్యా నా స్నేహితులు నాకు ఎల్లమందమూర్తి అని పేరు పెట్టినారు. అప్పట్నించీ మూర్తి అనే పేరు నిశ్చయమయిపోయింది. రూఢి అయింది. ఇక అనేక మంది దేవుళ్ళనీ, రాళ్ళకూ రప్పలకూ మొక్కుతామనీ మీ మిషనరీలు మావాళ్ళనంటారే. మీరు చర్చీలకు వెడతారు. మావాళ్ళు దేవాలయాలకు వెళతారు. మీకు జెహోవా, క్రైస్తు, మేరీ, హోలీఘోస్టూ మీకు ఏంజెల్సు, మాకు దేవతలు, మీకు అపోసిల్సు. మాకు మతకర్తలు, మీకు సెయింట్సు, మాకు ఋషులు, శాంతులు. మా మతం అఖండమయినది. రాధాకృష్ణనుగారు చెప్పినట్టు జీవిత విచారణ చేసే వారు మాలో ఎక్కువమంది, కాబట్టి మాకు లక్షల కొలది వేదాంతులు.

మిష: నువ్వు రాధాకృష్ణుని గ్రంథాలు చదివావా!

ఎల్ల: చదివాను. కాని చాలా భాగాలు అర్థం కాలేదు. అప్పటికీ మా వేదాంతం ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని.

మిష: సరే ఆలోచించుకో!

ఎల్ల: ప్రాపంచకంగా మొదటి రోజులలో మీ మతములో కలిసినవారికి లాభం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీ మతంలో కలిసిన వారంతా చదువుకుంటున్నారు. అనేకులు బి.ఏ.లో విజయం పొందారు. వారందరికీ ఉద్యోగాలు లేవు. కాబట్టి అనేకులు మీరు పెట్టిన పాఠశాలలోనే ఉపాధ్యాయులవుతున్నారు. కొంతమంది ప్రచారకు లవుతున్నారు. మాలో చదువుకున్నవారు తక్కువ. అందుకని ప్రాపంచకంగా మాకే ఎక్కువ లాభాలు కలిగే వీళ్ళున్నాయి, కాదా అయ్యా! -

ఎల్లమంద మూర్తి లేక మూర్తికి మనస్సు పరిపరివిధాల ప్రవహిస్తోంది. ఏదీ తోచదు. బి.ఏ తో తన చదువు పూర్తా?

తర్వాత ఏమి చేయాలి? ఎవ్వరు తనకు తర్వాత చదువు చెప్పించేది? ఏమిటి చదువుతాడు? బి.యే. లో ఫిజిక్సు పుచ్చుకొన్నాడు, తర్వాత?

తన జాతికి ఎలా సహాయం చేయడం? మహాత్మాగాంధీ నిజంగా అవతారమూర్తి! హరిజనులని పేరు పెట్టి తమ జాతిని తక్కిన కులాలతోపాటు సమం చెయ్యాలని తమ పవిత్ర జీవితం అంకితం చేసుకున్నారు. తన దేశంలోనివారే ఆయన దివ్యాశయాలకు అడ్డం వస్తున్నారు. ఇంతకూ ఈ కాలేజీ చదువు తమ వారందరూ చదవాలి. బాలురూ


అడివి బాపిరాజు రచనలు - 7

17

నరుడు(సాంఘిక నవల)