పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దౌర్భాగ్యంవల్ల ఒక కన్ను నుండైనా ఒక్క బాష్పబిందువైనా రాలిననాడు తక్కినవారి బ్రతుకులు వృధా అనీ. ఆ బ్రతుకులు హింసాపూరితాలనీ, ఆయన బోధించాడు. ఆయన శిష్యులే నేడు రాజ్యభారం వహించి దీన మానవుల కళ్ళనుండి రక్తాశ్రువుల మహాఝరులుగా ప్రవహింప చేస్తున్నారని నరసింహమూర్తి మేష్టారు గజగజ లాడిపోయినాడు.

ఈ అవతారము, ఈ దైవస్వరూపుడు, కోరి అవతారం చాలించింది మనుష్యుల కర్కశహృదయాలు చూచేకదా! ప్రేమలు ఉద్భవించని ప్రేమలు ఎండిపోయిన మనుష్యులే మహాత్ముని గుండెలో రివాల్వరు పేల్చినాడు. “ఓ ప్రభూ! నువ్వు ప్రేమ సముద్రానివి! ఓ పరమకరుణామూర్తీ! నీ బ్రతుకే ఒక ధర్మవిశ్వం!” అని వెంకట్రావు వివశుడై ఆ పవిత్రభూమి ముందు సాష్టాంగపడినాడు.

వారందరూ లేచి ఈవలికి వచ్చినప్పుడు వెంకట్రావు భార్య దగ్గరకుపోయి “పద్మా! నాపైన ఇంకా కోపం తీరలేదా?” అని ప్రశ్నించినాడు. పద్మావతి కన్నుల నీరుతోనే అతని మోము ఒకసారి ఆశ్చర్యంతో చూచి “కోపం ఏమిటి బావా?" అన్నది.

“వచ్చినప్పటినుండీ ఏదోలా ఉన్నావేమి?"

ఆ బాలిక కన్నులు గంగా, యమున లయ్యాయి. “బావా! బావా! నిన్ను... నిన్ను... ఓ నిమిషమైనా... వదిలి ఉండలేను. నాకీ పరీక్షలూ వద్దు... ఈ... ఈ... సంగీతమూ వద్దు!... నీకింత చాకిరీ చేసుకుంటూ... ఉంటాను."

“అదేమిటి పద్మా!" “బావా! నువ్వే... నువ్వే... నాకు... మహాత్ముడవు నా పైన నీకు... నీకు... ప్రేమ... పూర్తిగా పోయింది... అని... అని”

“ఓసి వెఱ్ఱి పిల్లా! నీకోసం నేను బ్రతికివున్నాను. సముద్రంలో నా పడవ అలా దరీ, అంచు లేకుండా కొట్టుకుపోతూ నీ మూర్తి... అందాలనీ, నువ్వు... నా ఎదుట ప్రత్యక్షం అవుతూ.... నాకు సరియైన దారి చూపించింది. నీకోసం యుద్ధానికి వెళ్ళాను. ఆ యుద్ధంలో నీ ఆలోచన. నువ్వు నాకోసం కనిపెట్టుకొని ఉన్నావన్న ఆలోచన నాకు ఏనుగుబలం, సింహశక్తి ఇచ్చినాయి. నువ్వే నన్నెప్పుడు కాపాడుకొంటున్నావు అన్న గాఢమైన నమ్మకంతో ముందుకు చొచ్చుకు వెళ్ళేవాడిని.”

“నా... నా... మీద నీ ప్రేమ ఏమీ పోలేదూ?"

“ఎలా పోతుంది. పోలేదుకదా. మరీ కోటిరెట్లు పెరిగిపోయింది. నువ్వు కోరితే అన్నీ మాని ఊరు ప్రయాణం కడ్తాను."

ఆమె కన్నులు వెలిగిపోయాయి. అప్పుడే పాలసముద్రంలో దివ్యకమలంతో ఉద్భవించిన లక్ష్మిలా ఆమె తేజరిల్లిపోయింది. ఆమె పదిమందీ చూస్తున్నారని సిగ్గయినా లేకుండా భర్త పాదాలకడ మోకరిల్లి నమస్కరించింది. వెంకట్రావు ఆమెను లేవనెత్తి హృదయాని కదుముకొన్నాడు. సంధ్య చీకట్లు ఆవరిస్తున్నాయి. రాజఘాట్ పవిత్ర చైత్యంపై సాయం సంధ్యాదేవి అరుణకాంతులు వెలిగించింది.

నరసింహమూర్తి మేష్టారు తనలో ఒక నూతనానందం పాలవెల్లువలా పొంగిపోగా, ఆ దంపతులను యమునానది తీరాన్నే వదలి తాను రాజఘాట్ కడ ప్రార్ధిస్తూ కూర్చున్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

176

జాజిమల్లి(సాంఘిక నవల)