పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుచ్చి వెంకట్రావుకూ, సుశీలకూ ఎంతవరకూ సాగింది? సంబంధం హద్దు దాటితే ఎందుకు వచ్చినట్లు ఈతడు? భార్య గనుక అధికారం చెలాయించడానికా? అయితే భార్యను పరీక్ష పూర్తిచేసుకోనీయకుండా తీసుకుపోతాడా? అయితే ఇంత ఖర్చయ్యే ఈ హంగామా ఎందుకు? ఆడవారి మనస్సు బ్రహ్మకే అర్థం కాదన్నారుగాని మగవారి మనస్సులు వారికే అర్థంకావు. తాను భగవంతుని ప్రార్ధన చేయడం తప్ప గత్యంతరం ఏముంది?

4

తన గదిలోకి వెళ్ళింది పద్మావతి. స్టేషన్ ప్లాట్ ఫారంపై తన బావను చూడగానే ఆమెకు పట్టరాని ఆనందం కలిగింది. చిన్నతనంలో ఒకసారి తన బావ సముద్రానికి బలి అయిపోయాడు అన్నప్పుడు తన ప్రాణమే పోయినట్లయి, తనకీ ప్రపంచమే లేదనుకొని, తాను కూడా సముద్రానికి బలి అయిపోదామని నిశ్చయించుకొన్నప్పుడు, బావ దొరికాడు. బ్రతికి ఉన్నాడు. రెండు రోజులలో వస్తాడు అని వార్త విన్ననాటి అద్భుతానందంకన్న ఈనాడు తన కెక్కువ ఆనందం కలిగిందే! ఆ వెంటనే బావ ఏదో విధంగా ఉంటే తాను మాట్లాడలేకపోయింది. ఏదో అధోలోకాలకు క్రుంగిపోతున్నట్లు తనకు ఆపరాని నిస్పృహ కలిగింది. తనకు ఈలా విడిగా గదీ! బావకు తనపై ప్రేమే పోయిందా? బావ తన్నిక ప్రేమించడా? తనకీ సంగీతం ఎందుకు? ఈ చదువులూ, పరీక్షలు ఎందుకూ? రమ్మనగానే వచ్చాడే! ఎందుకు? కళ్ళ నీళ్ళు తుడవడానికా? ఆమెకు వెక్కి వెక్కి ఏడ్పు వచ్చింది. పందిరి మంచముపై వాలిపోయింది. .

అటు బుచ్చి వెంకట్రావుకు ఆశ్చర్యం కలిగింది. పద్మావతికి తనపై కోపం తీరలేదని అతడనుకున్నాడు. ఆమె మాట్లాడదు - అంత మౌనం! తాను సిగరెట్టు అవీ కాలుస్తూ ఉంటాడుగదా అనీ, ఆమెకు ప్రత్యేకగదీ అవీ ఏర్పాటు చేశాడు. ఒక్కమాట మాట్లాడదు. తనకెందుకు రమ్మని టెలిగ్రాం ఇచ్చినట్లు? తన దేవి పద్మావతి ఇక దూరమైపోతుందా! ఇకనుండి తన బ్రతుకు తెల్లవారిపోతుందా? ఇతడు సిగరెట్టుపైన సిగరెట్టు కాలుస్తున్నాడు. ముందు గదిలో ఒక సోఫాపై చతికిలబడి కన్నుమూశాడు.

ఒకసారి మహామారిలా ఎక్కడనుండో తప్పు అభిప్రాయం కలిగినప్పుడు, ఆ తరువాత అందుకు సంబంధించిన వారి వర్తనమంతా ఆ భావానికి శ్రుతి అయిపోతుంది. ఆ తప్పు అభిప్రాయం ఇంకా గాఢమైపోతుంది.

ఆ ముగ్గురూ ఆ రోజూ, ఆ మర్నాడూ ఎలా గడిపారో? ఆ మహానగరంలోని, ఆ చుట్టుప్రక్కల విచిత్రాలు ఏలా సందర్శించారో? కుతుబ్‌మినార్, లాల్‌ఖిల్లా, జుమ్మామసీదు, ఫతేపూర్ సిక్రీ పైత్యరోగి నోట భక్ష్యాలయ్యాయి. మహాత్మాజీ చైత్య ప్రదేశమైన రాజ్‌ఘాట్ దివ్యక్షేత్రం కడ పద్మావతి గుండెలవియగా రోదించింది. బుచ్చి వెంకట్రావునకు కన్నుల నీరు తిరిగింది. నరసింహమూర్తి మేష్టారు ఆడదానిలా వాపోయినాడు.

మహాత్ముడు అవతారపురుషుడు. దుఃఖార్హులైన సర్వమానవుల బాధలూ హరించి తన బ్రతుకులో ఆస్వాదించుకొన్నాడు. బీదతనంవల్ల, కడుపునకు ఒక కణమైనా లేని

అడివి బాపిరాజు రచనలు - 7

175

జాజిమల్లి(సాంఘిక నవల)