పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



4

రాధాకృష్ణ ఇంటిలో బుచ్చి వెంకట్రావూ, పద్మావతీ, నరసింహమూర్తి, రాధాకృష్ణ భార్య సుశీల చేరారు. నాయరు వంటలో పండితుడు, మధురమైన మలబారు శాకాహార భోజనమూ, పిండివంటలు వడ్డించగా భోజనాలు పూర్తి చేసి, తాంబూలాలు వేసుకుంటూ లోని హాలులో కూచున్నారు. రేడియో చక్కని సంగీతం పాడుతున్నది.

పద్మా: ఇప్పుడు వచ్చే సంగీతం అంతా వట్టి కాఫీ హోటలు సంగీతం మేష్టారూ!

నర : అవునమ్మా అవును. ఎవరికి కావాలి ఉత్తమమైన కర్ణాట బాణి?

రాధా : ఉత్తమమైన ఉత్తరాది బాణి కూడా ఉత్తరాది వారికే అక్కరలేక పోతోంది.

సుశీ : నాకు మాత్రం ఈనాటి సంగీతం చాలా అందంగా ఉంటుంది.

బుచ్చి: కొన్ని కొన్ని ఉత్తరాది సినిమా పాటలు సురయా పాడినవీ, కన్నన్‌బాల పాడినవీ లతామంగేష్కర్, షేంషెడ్‌బీగం పాడినవీ చాలా ఇష్టం నాకు. అలానే సైగల్, పంకజమల్లిక్, వసంతదేశాయీలు నాకు ఇష్టం.

అక్కడనుంచి అందరూ రాధాకృష్ణ గాంధర్వ మందిరానికి పోయారు. అక్కడ రాధాకృష్ణ మేళం వారు అంతా సిద్ధంగా వున్నారు.

రాధాకృష్ణ తన భార్యనూ, ముగ్గురు అతిథులనూ అక్కడున్న సోఫాలపై కూచోపెట్టి, తానువెళ్ళి తన మేళ వాయిద్యాల వారి మధ్య తన దర్శకాసనంపై అధివసించాడు.

అక్కడనుంచి అతడు గంభీరమైన తన కంఠమెత్తి నాలుగు పాటలు పాడాడు. ఆ తర్వాత సుశీల వెళ్ళి రాధాకృష్ణ ప్రక్కన కూచుని రెండు మలయాళపు పాటలూ ఒక తెలుగుపాటా పాడింది. ఆ

నరసింహమూర్తి మేష్టారు ఆనందంతో చప్పట్లు కొట్టి “చాలా ఆనందంగా ఉందయ్యా, ఇంక మా అమ్మాయి పద్మావతి పాట వినాలి నువ్వు. అమ్మా! ఏదీ ఒక్క పాట వినిపించూ. రాధాకృష్ణా! ఒక్క పిడేలూ, మృదంగమూ మాత్రమే మేళం. నా ఫిడేలు తెచ్చుకున్నాలే! దానితో నేనే వాయిస్తాను” అన్నాడు.

“పాడు పద్మా! భయమేమిటి? అంతా మనవాళ్ళే!” అని బుచ్చి వెంకట్రావు భార్యను కోరాడు.

పద్మావతి శ్రుతి చూచుకుని తన గురువు అందివ్వగా నెమ్మదిగా రాగం ప్రారంభించింది. రెండు మూడుసార్లు భయంచేత శ్రుతి తప్పింది. కాని వెంటనే అందుకుంది. నెమ్మది నెమ్మదిగా తనకు ఇష్టమైన ఆ తోడిరాగం సాగించింది. ఆ రాగంలో తన వర్ణంలోనికి ప్రసరించింది. ఆ వెంటనే త్యాగరాజకృతి అందుకుంది. ఆ కృతికి సరిపడిన స్వరకల్పనా వికాసంతో ఆ పాట పూర్తి చేసింది. అంతా పదిహేను నిమిషాలు పట్టింది.

ఆ పాట పాడినంతసేపూ అందరూ మంత్రముగ్ధులై విన్నారు. రాధాకృష్ణకు ఆ పాట వింటూ ఉంటే తాను ఒకనాడు సందర్శించిన ఉదకమండలం ప్రకృతి దృశ్యం ప్రత్యక్షం అయింది. ఒత్తుగా వివిధములైన ఆకుపచ్చని రంగుల చెట్లు నిండివున్న కొండచరియలు చిన్న చిన్న సెలయేళ్ళు, చెరువులు, లేళ్ళగుంపులు, పూవులు, నెమళ్ళు,

అడివి బాపిరాజు రచనలు - 7

127

జాజిమల్లి(సాంఘిక నవల)