పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పక్షులు, మేఘాలు ఒక మహాశ్రుతిలో స్వరాలై దర్శన మిచ్చినట్లు అతనికి తోచింది. ఆ కంఠం అంత అమృతమయమని అతడు కలలోనైనా అనుకోలేదు. ఆ బాలికా, ఆమె గానమూ, చంద్రమూర్తీ, చంద్రికా అయి అతనికి ఎదుట లోచనగోచరమైనట్లయినది.

ఆమె వెంటనే రాగమాలికతో “కస్తూరి తిలకం” అన్న శ్లోకం పాడింది. శ్రీకృష్ణభగవానుడు నీలమేఘ శ్యామల కాంతిపూర్ణుడై, కోటి సౌందర్య - రాజిత హాసాంచిత వదనుడై, సదస్యులందరికీ గాంధర్వరూపంలో ప్రత్యక్షమైనట్లనిపించింది. క్షేత్రయ్య పదం ఆ వెంటనే ఎత్తుకొన్నది.

నరసింహమూర్తి ఆనందం వర్ణనాతీతం, అతడా ఆనందంతో అచేతనుడౌతూ తన ఫిడేలును వాయించడం మానుతూ ఉండేవాడు.

మేళంవారు ఆ పరమసౌందర్య గాంధర్వం వింటూ శిల్పాలే అయిపోయినారు. ఏమి భాణి! ఇది మానవమాత్రుల భాణియా అని బుచ్చి వెంకట్రావు, ఆమెను తప్ప సర్వమూ మరచిపోయాడు. సుశీలాదేవి కన్నురెప్ప వేయని అనిమిషత్వంతో పద్మావతిని చూస్తూ ఆమె గాంధర్వంలో మేళవించి పోయింది. ఇవన్నీ ఒక గంట పట్టాయి.

పద్మావతి పాట చాలించి అక్కడే తన తల వంచుకొని కన్నుల నీరు కారిపోగా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. అది గమనించగానే సుశీలాదేవి ఒకగంతున ఆ బాలిక కడకు పరుగిడి ఆమెను పొదివి పట్టుకొని, లేవదీసి తన గదిలోనికి తీసుకుపోయింది. అక్కడ ఆమెను ఒక సోఫాపై కూర్చుండబెట్టి తానామె ప్రక్కన కూర్చుండి, “అంత సిగ్గయితే ఎలా అమ్మా!” అని తెలుగులోనే మాట్లాడుతూ, నీ సంగీతందా నేను వర్ణించ శక్తి చాలదే. జన్మకోసారి కూడా ఇందమాదిరి పరమసౌందర్య స్వరూపమైన సంగీతం దొరుకునో ఏమో!” అని అన్నది.

ఇంతట్లో నాయరును పిలిపించి “కోకోచేసి, వెంటనే తీసుకురమ్మని.” ఆజ్ఞ ఇచ్చి, ఈలోగా తాను మలబారు నుంచి తెచ్చిన మంచి ఔషధం రెండు మాత్రలు మింగించి, మంచినీళ్ళు త్రాగిపించింది.

సుశీల పద్మావతిని గదిలోకి తీసుకువెడుతూ ఉంటేనే పద్మావతి తేరుకుంది. మందు బాగా పనిచేసింది. కోకో పద్మావతిని పూర్తిగా మామూలు మనిషిని చేసింది.

సుశీలాదేవి పద్మావతిని తన స్నానాల గదిలోకి తీసుకుపోయి, మొగం కడుక్కోమని, తుడుచుకొనే తువాలు ఇచ్చింది. ఆమెకు తలసర్ది, పౌడరు అవీ వ్రాసి, బొట్టుంచి, తన పూలబుట్టలోంచి జాజిమల్లియ దండను తీసి ఆమె తలలో అమరించింది.

పద్మావతి జాజిమల్లియ దండను చూచింది. ఆమె మనస్సు తేటబారింది. ఆ దండతో తన తలను అలంకరించిన సుశీలను పద్మావతి సిగ్గుతో పలకరిస్తూ ఇంగ్లీషులో “వదినా! ఈనాటినుంచి మనమిద్దరం ప్రాణ స్నేహితులం సుమా!” అంది.

★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

128

జాజిమల్లి(సాంఘిక నవల)