పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(చతుర్థ గుచ్చము)

ఏమీ తెలియనివాళ్ళ జీవితమే ఆనందమయము. సముద్రంలో ఏరు కలిసేచోట, బెస్తలపల్లెలో ఏటిలో పోటూ పాటులూ, సముద్రం కెరటాలూ, ఆటలాడుకునే యిసుక వొడ్డుల్లోనే, తాను బుచ్చి వెంకులుగా వున్న నాటి జీవితమే ఏ దిగులూ లేకుండా, ఏ పొగులూ తగలకుండా జరిగిపోయింది. వేసవిలో సాయంకాలం సముద్రదూరాలనుంచి వచ్చే చల్లగాలిలా హాయిగా వుండేది. చేవపారిన కొబ్బరిమానుల్ని ఏటిలో ఈ దరినో ఆ దరినో, నిట్రాళ్ళుగా పాతి, పోటులో వలలుగట్టి, పాటులో చేపలను పోగుచేసుకొనే ఆనందం, బంగారు నాణాలను ప్రోగుచేసుకొనేటప్పుడేనా దొరకదు కదా! ఈ ఆలోచనలు బుచ్చి వెంకట్రావు హృదయంలో మేఘాలై కమ్ముకు వచ్చాయి. పద్దాలు ఎంత ఒడుపుగా చేపలను పట్టుకొనేది. ఔను తను గడగాలం వేసి, కాచుకుని వుంటే, గంటలు గంటలు ఇంత చిన్న చేపైనా తన గేలం ముల్లుకు తగిలేదా ఏమన్నానా? ఇంతట్లో పద్దాలు పరుగు పరుగున వచ్చి “బావా! ఎన్ని చేప లట్టినావు? ఏంది! ఒక్క సేపయినా గాలానికి తగల్లేదేం? సూసుకో నే మంత్రంబెట్టి ఎన్ని సేపల్లాగేస్తానో! హామ్. మాంకాళీ హూం మాంకాళీ ఓ యీ శెడుసేపా పడవే” అంటూ గేలంగెడ చేత్తో పుచ్చుకొని తన అందమైన చేతులతో యిటూ అటూ కదిపేటప్పటికి జర్రని గేలం తాడు బిగువెక్కేది. “ఓ చేప పడింది. తాడుకి కట్టిన బెండు ములిగిపోయింది. “తే! యిలాతే! నువ్వు లాగవే”వని తాననేవాడు: “ఓ లాగేయి, అబ్బో దిట్టమైన చేపే! నన్నే లాగేస్తున్నది” అన్నాడు. ఇద్దరూ పట్టి నెమ్మదిగా వెనక్కి నడుస్తూ ఒక సరివిచెట్టు వూతపట్టుకుని ఒక మూరన్నర "పంజరం” చేపని యివతలకు లాగారు! ఎంత తెలివితో పద్దాలు ఆ చేపను ఒడిసిపట్టుకొందీ! తామిద్దరూ కలిసి ఎన్నిమార్లు చందువా చేపలూ, సొరలూ, సముద్రపు పెద్దరొయ్యలూ, పండుగొప్పులూ, సావిడాయిలూ, నెత్తళ్ళూ అతినేర్పుతో పట్టుకొని ఆనందపడలేదు! -

ఆ తీయతీయని దినాలు వెళ్ళిపోయాయి. తమ జీవితంలోంచి చేపల వాసన పోయింది. కొత్తగా వచ్చిన శాండల్ వుడ్ సబ్బు వాసనా, పేరీస్ సెంటుల పరిమళాలూ శ్రుతులు కలియక, తెచ్చుకోలు మాయై, ఎరువులు సొమ్ములైనట్లు కదా!

ప్రపంచ జ్ఞానంవల్ల ఇదివరకు ఎరగని విషయాలు, జీవితంలో క్రొత్తగా ప్రవేశిస్తాయి. ఈ చెన్నపట్నం బ్రతుకు ఎప్పుడూ ఆగని గందరగోళంతో, తగ్గని వేగంతో, అంతులేని కాంక్షలతో నిండి వుంది. కోరి అంతు తెలియరాని దుఃఖాలు తెచ్చిపెట్టుకున్నాడు తాను.

అతని ఆరోగ్యం చింది, జలజల కండల పొంకాలు విరిగి ఉంది. అతని బలం సముద్రం కెరటాలులా ఉప్పొంగుతూ ఉంటుంది. అతని స్త్రీవాంఛ ఉత్తమ మానవనైజ ధర్మపూర్ణము. ఎన్నడూ అది అతిగా ఉండలేదు. ఉత్తమంగా ఆరోగ్యవంతమై ఉండేది. నేడాతని సహధర్మచారిణి తన్ను ఒంటిగా వదిలి వెళ్ళిపోయింది. తన బ్రతుకు చుక్కాని పోయిన నావలా అయింది. ఈ వాగుల్లో, వేగమైన ప్రవాహాల లాగుడులో, తన నావ మునిగిపోవునో, ముక్క లవునో!

అడివి బాపిరాజు రచనలు - 7

113

జాజిమల్లి(సాంఘిక నవల)