పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వదలిపెట్టుకోగలిగిందే! తన చిన్ననాటినించీ తనతో ఆడుకొన్నవాడు, లోకం అందిచ్చే చేతులు పట్టుకొని, తనతోపాటు అతడున్నూ పైపథాలకు నడచి వచ్చాడు కదా? ఏ జీవితం జీవిస్తే ఆ జీవితాన్ని సమగ్రంగా అందిపుచ్చుకొని, దృఢమైన నడకలు వేయగల ధీమా గల్గిన మనిషి! అతనికి చేపల పేర్లన్నీ తెలుసు, వాటి గుణగణాలు తెలుసు. వాటి జీవిత విశేషాలన్నీ తెలుసు. సముద్రపు మొసలి (షార్క్) కాని, టేకిచేపగాని, తూరగాని, ఎదుట వచ్చినప్పుడుగాని, పడవని ఎదుర్కొన్నప్పుడుగాని వాని బారినుండి ఎలా తప్పించుకోవాలో, కూడా వుండే శూలబల్లెంతో వాటిని ఎలా హతమార్చాలో అతనికి పూర్తిగా తెలుసు.

తన్ను పడవలో తీసుకువెళ్ళేవాడు! అతడు తెడ్డువేస్తే తాను తోలవేసేది. అతడు తెరచాప ఎత్తి చుక్కాని కోలవేస్తూ వుంటే తాను డామాను దగ్గర కూర్చొని.

“ఏ దిక్కు పోతాదో
 ఈ కడలి మన పడవ
 ఆ తీరమేలేని
 ఆకాశమే నీరు ||ఏ దిక్కు |

 పై కెగసి వాగులో
 పల పాల తుంపర
 నీ రాల బయలులో
 దారడిగి దారంది ||ఏ దిక్కు||

 తెరచాప రెక్కలతొ
 తెల్ల పులుగై పడవ
 మన వలపు రేవునకు
 మనల నిరువుర చేర్చు ||ఏ దిక్కు!

అని పాడుతూ ఉంటే తన బావ తన్ను చిరునవ్వులతో చూస్తూ తానూ ఒక పాట ఎత్తుకునేవాడు.

“వాగువాగులు కలిసి సాగు దారుల యెంట
 వాగు వడిలో తేలి వడివడిగ మన పడవ
 నా ముందు నీ నవ్వు నా ఎనకనా నువ్వు
 ఈ పడవ తెరలెత్తు మన బ్రతుకు దవుదవ్వు.

★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

112

జాజిమల్లి(సాంఘిక నవల)