పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు తన మనసులోని బాధను చంపుకోడానికై తన కులస్థులు నివసించే చేరీలలోనికి వెళ్ళేవాడు. ఎంత దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు గట్టిగా కాళ్ళు చాపుకుంటే మనిషి పట్టనంత చిన్న స్థలాల్లో కట్టుకొన్న గుడిసెలలో కాపురాలు - పరిసరాలు ఎన్నో కల్మషాలు కూడుకున్న ప్రదేశాలు. ఇంత పెద్ద చెన్న పట్టణంలో జీవిస్తూ ఒక్కరైనా సినిమాకు వెళ్ళి చూడగలుగుతారా? ఆఖరికి చీనాబజారులో, రోడ్డు ప్రక్కన పెట్టుకొని అమ్మే వస్తువుల్లో ఒక్క అణా సరుకైనా కొనుక్కొని ఆనందించగలరా! ఒకనాడైనా వారు కాఫీ హోటలెరుగుదురా! సంగీతం కచ్చేరులంటే ఏమిటో వారికి తెలుసా? ఎందరి జీవితాలలో నాట్యాలు నిండిపోయి ఉన్నాయి! కాని ఒక్క నాట్య ప్రదర్శనానికై యీ చుట్టాలు, యీ ప్రజలు, యీ బెస్తలు, యీ చేపలు పట్టుకునేవాళ్ళు వెళ్ళగలరా? సముద్రపు ఒడ్డున చిన్న పీతలులా బ్రతుకులే ఏనాటికీ వాళ్ళకి రాసివున్నాయా అనుకున్నాడు.

ఎక్కడ చూచినా వలలు - చేపలు వుంచుకునే బుట్టలు! గేలాలు! కుళ్ళిపోయిన చేపల వాసన!!

ఏనాటికైనా యీ చేరీలు, తీర్చిన వీధులలో, తోటల మధ్య ఉన్న సొగసైన యిళ్ళతో, శుభ్రమైన బట్టలు కట్టుకొని ఆడుకొనే పిల్లలతో పొందికగా అలంకరించుకొని కళ్ళల్లో కాంతులు వెలుగుతూవుండగా ఆరోగ్య దేవతలులా నడిచిపోయే స్త్రీలతో కలకలలాడి పోగలవా! తెచ్చిన చేపలు ఉంచేందుకు, వాటిని బుట్టలు కట్టేందుకు, తర్వాత ఎగుమతి చేయడానికి వేరే ఒకటి ఫ్యాక్టరీలాంటి కర్మాగారం వుండవచ్చు గాక! అలాంటి సంస్థను శుభ్రంగా, శాస్త్రయుక్తంగా వుంచవలసి వుంటుంది. కర్మాగారానికీ, ఆ కర్మకూ జనకులైన బెస్తల జీవితానికి ఇతర సంబంధమేమీ వుండకూడదు. వస్త్రాల ఫ్యాక్టరీలో పనిచేసేవారి యిళ్ళలో దూది పడివుంటుందా?

అతడు గాలివానంత నిట్టూర్పు విడిచాడు.

2

ఆంధ్ర మహిళాసభ విద్యార్థిను లందరు కలిసి వారి ఉపాధ్యాయినుల ఒద్దికలో ప్రత్యేకం బస్సు ఒకటి కాంట్రాక్టు తీసుకొని, మహాబలిపురం వెళ్ళారు. బాలికలందరూ కలకలలాడుతూ ఆ ప్రదేశమంతా నిండిపోయారు. బొమ్మలు చూస్తున్నారు కొందరు. ఒక్కొక్క శిలతోటే నిర్మాణం చేసిన చిన్న ఆలయాలైన శిలా రథాలకడకు పరుగిడిపోయారు కొందరు. కొందరు సముద్రతీరం దగ్గర వున్న దేవాలయానికి పరుగెత్తారు. భీముని పొయ్యి చూశారు. అర్జునుని తపస్సు ఆశ్చర్యం పొందుతూ గమనించారు. వేణుగోపాలుని వెన్నముద్ద చూశారు.

వాళ్ళకి శిల్పరహస్యాలు అర్థమయ్యాయి అని కాదు. పల్లవ శిల్ప విశిష్టత తెలిసిందనికాదు! శిల్ప సౌందర్యమే వారిని హత్తుకొన్నది. ఆ ప్రదేశముయొక్క మంత్రశక్తి వారందరిని ఆవహించింది. ఏ యుగాలనాటి అనుభూతులో, ఏ మహాశిల్పుల దివ్యస్వప్నాలో ఆ ప్రదేశం నిండా నిండి, ఆ క్షేత్రానికి వచ్చిపోయే యాత్రికుల హృదయాలను స్పృశిస్తాయి.

అడివి బాపిరాజు రచనలు - 7

114

జాజిమల్లి(సాంఘిక నవల)