పుట:Gutta.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా దిగువ అను పదము ఒక కులముగా ఏర్పడినది. బ్రహ్మణుల చేత మా దిగువవారని పిలిపించుకొను సమాజమునుండి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేయుటకు అలవాటుపడడము వలన గుడ్డలు ఉతుకువారిని చాకలి యనీ, నెత్తికొరుగు వానిని మంగళియనీ వారు వారు చేయుపనులను బట్టి దిగువ కులమునుండి అనేక కులములు చీలిపోయాయి. ఇలా చీలిపోగా మా దిగువ కులము కొంత మిగిలిపోయింది. అలా మిగిలి పోయిన మా దిగువ కులమే నేడు కొంత పేరుమారి మాదిగ కులముగా చెప్పబడుచున్నది. ఈ కుల వ్యవస్థను మొదట బ్రహ్మణులు ఏర్పరచినదేనని తెలియవలెను. ఈ విధముగా ఏర్పడిన అనేక కులములలో కమ్మ కులము కూడా ఒకటి. ‘ఇందూ’ అను శబ్దము కాలగమనములో ‘హిందూ’ అను శబ్దముగా మారినట్లు, ముంబాయి ‘బొంబాయి’గా మారినట్లు మొదట అమ్మ కులముగా పేరుగాంచిన కులము కాలక్రమములో కమ్మ కులముగా మారిపోయినది. మొదట అమ్మకులము అనునది ఎలా వచ్చినదనగా!


పూర్వము దైవజ్ఞానము తెలియని దిగువ వారిలో కొందరు వ్యవసాయము మీద మక్కువగలవారై భూమిని దున్ని సాగుచేసి పంటలు పండించెడివారు. అప్పటికాలములో భూములన్నీ సారవంతమైనవిగా ఉండుట వలనా, వర్షములు సక్రమముగా కురియుచుండుట వలనా భూములన్నీ బాగా పండేవి. ఇప్పటివలె అప్పుడు ధాన్యమును కొనుగోలు చేసే మార్కెటింగ్‌ వ్యవస్థలేదు. కావలసిన వస్తువులను ధాన్యమును ఇచ్చి తెచ్చుకొనెడివారు. ధాన్య మార్పిడి తప్ప డబ్బు మార్పిడి లేకుండెడిది. అందువలన పండిన ధాన్యమును భూమిలోని పాతర్లలో దాచెడివారు. పండిన ధాన్యము సంవత్సరములోపల అయిపోయేవి కావు. అలా ధాన్యము మిగులు పడుచుండుట వలన ఉదార స్వభావముతో చాలామందికి అన్న దానము చేసెడివారు. కొందరికి ధాన్యమునే ఉచితముగా ఇచ్చెడివారు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/35&oldid=279917" నుండి వెలికితీశారు