పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రతీతి. ఈమె లీలలు విచిత్రంగా ఉండేవట. ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ చక్కని పడుచులా తయారై వీధిలోపోతున్న గాజులవానిని పిలిచి గాజులేయించుకుని ఒక ఇంటిలోకి పోయిందట డబ్బులిస్థానని. ఆమె ఎప్పటికీ రాకపోయేసరికి అతను ఆయింటివారినిపిలిచి అడిగాడట. వాళ్ళు ఆమె ముత్యాలమ్మ అని గ్రహించి ఆడబ్బులిచ్చి పంపేశారట. ఇలాగే మరిణమ్మ మీదకూడా గాజుల కధవుంది.ఆమె గాజులు వేయించుకుని వెళ్ళిపోతే మల్లయ్య నాడబ్బులో నాడబ్బులో అని కేకలు పెడుతుంటే అతన్ని అక్కడ రాయిని చేసిందట. దానిని గాజులమలారం రాయి అంటారు.

ఇక కొంకుదురు గంగాలమ్మ అక్కడి చెరుఫులో దొరికితే గట్టునబెట్టి గుడి కట్టించారు. పంటలు ఎక్కువ పండాలని, గ్రామంలో మసూచి, కలరాలవంటి వ్యాధులు రాకుండా కాపాడాలని యీ అమ్మవరికి కోళ్ళూ, మేకలూ కోసి ఏటేటా జాతర చేసి తీర్ధంచేస్తారు. ఆపదల్లో ఆమెకు మొక్కుకుంటారు. ఊళ్ళో ఎవరు పెళ్ళిచేసుకున్నా తప్పనిసరిగా ముందు యీఅమ్మవారికి చలివిడి పానకాలు పోస్తారు. ఈ అమ్మవార్ల తీర్ధాలకు గారెలు, బూరెలు వగైరా పిండివంటలుచేసి అమ్మవారికి నైవేధ్యాలు పెడతారు. పొరుగూరి బందువులను కూడా పిలుచుకుని పండుగలా జరుపుకుంటారు. ఈ అమ్మవార్ల ప్రతిరూపాలు గరగలు, జాతరలో అసాదులు (పూజారులు) మావాళ్ళు పరికిణీ వేసుకొని, ఒక పంచిపైటచెంగులా వేసుకొని (అమ్మవారు స్త్రీ గదా, అందుకని స్త్రీ వేషాలు) గరగలు నెత్తిమీద పెట్టుకుఇ డప్పుల మోతకు అనుగుణంగా ఎగురుతూ (ఈ మధ్య దీనిని కూడా నాట్యం అనేస్తున్నారనుకోండి) చేతిలో వేపాకుతో ఆశీర్వదిస్తుంటారు. ఇంటింటా కాళ్ళమీద బిందెలతో నీళ్లుపోసి బియ్యం, పసుపు, కుంకుమ, ఫలహారం పళ్లెంలో పెట్టి యిచ్చి హారతియిస్తారు. తీర్దంనాడు రాత్రి గుడిదగ్గర మొక్కుకున్న వాళ్లు మేకలూ, కోళ్ళూ కోస్తారు. ఈ గంగాలమ్మకు కూడా ఒక గాధవుంది. ఈమె పడాలవారి ఆడబడుచు అనీ, మరణం సంభవించినా మమకారం చావక అక్కడ గ్రామదేవతగా వెలిసి ఆవూరిని కాపాడుతుంఅనీను, అందుకే జాతర సమయంలో యీనాటికీ కూడా ఆమెకు పడాలవారు మొదట చీర, రవికల గుడ్డ పెట్టి గరగెత్తితేగాని జాతర లేవదీయరు.