పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

దంపూరు నరసయ్య


ప్రస్తావనకు వచ్చాయి.

2. వారికి అర్హత ఉందా : సంపాదకీయం

పందొమ్మిదో శతాబ్దంలో ప్రజాభిప్రాయాన్ని రగుల్కొల్పి, కూడగట్టడంలో పత్రికలు గొప్ప పాత్ర నిర్వహించాయి. దేశీయులు నడిపే పత్రికలు ఆదాయంపన్ను చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం 1860లో మొదటిసారి ఆదాయంపన్ను విధించినా, అయిదేళ్ళ లోపలే దాన్ని తొలగించింది. మళ్ళీ 1886లో వ్యవసాయేతర ఆదాయంమీద పన్ను విధించింది. ఈ చట్టం పరిధిలోకి కొద్దిమంది భారతీయులే వచ్చినా, పన్ను వసూళ్ళ పేరుతో అధికారులు సామాన్య ప్రజలను వేధించారు. ఆఫ్ఘనిస్థాన్ మీద రష్యన్ దాడి భయాన్ని ఎదుర్కొనడానికి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడుకోడానికి, కొత్తగా సైనిక దళాల ఏర్పాటు చేసుకోడానికి ఆదాయంపన్ను విధించక తప్పదని ప్రభుత్వం తీర్మానించింది. తన సామ్రాజ్య రక్షణ కోసం, క్షేమంకోసం ఈ నిధులను స్వయంగా ప్రభుత్వం సమకూర్చుకోవాలని భారతీయ యాజమాన్యాలలోని పత్రికలు వాదించాయి. వేయి రూపాయలకు మించి నెలజీతం అందుకొనే ఉద్యోగుల జీతంలో పదిశాతం పన్ను విధించాలని, వేసవిలో ప్రభుత్వ పాలనను శీతల ప్రాంతాలకు మార్చడం వంటి కార్యక్రమాలు మానుకొని, ప్రభుత్వ దుర్వ్యయాన్ని నిరోధించాలని ప్రత్యామ్నాయ మార్గాలను పత్రికలు సూచించాయి. 1887 మద్రాసు కాంగ్రెసు సభలలో నెలసరి ఆదాయం వేయిరూపాయలకు మించి ఉన్న వారిమీద మాత్రమే ఆదాయం పన్ను విధించాలని తీర్మానం చేయబడింది. ప్రజాందోళనకు తలఒగ్గి ఆదాయం పన్ను చట్టాన్ని సవరించినా, ఈ వ్యవహారంలో ప్రభుత్వం అపఖ్యాతిపాలైంది.

భారతీయులు నడిపే పత్రికలు బ్రిటిష్ ప్రభుత్వంతోనే కాక, ఆనాటి ఆంగ్లో ఇండియన్ పత్రికలతోను పోరాడవలసి వచ్చేది. మెయిల్ పత్రికో, మరొక ఆంగ్లో ఇండియన్ పత్రికో ఆదాయం పన్ను మిద వ్యక్తపరచిన అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ నరసయ్య “వారికి నిజంగా అర్హత ఉందా !” అనే ఈ సంపాదకీయం రాశాడు. దీని తెలుగు అనువాదం :-

"క్షమించండి ! మేము ఎంతో గౌరవించే మా సహపత్రిక అభిప్రాయాలతో ఏకీభవించలేము. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఆదాయంపన్ను చట్టం విషయంలో స్థానికపత్రికలు నిష్కారణంగా వ్యతిరేకించి, అనవసరంగా స్పందిస్తున్నట్లు ఆ పత్రిక ఆరోపించింది. ఆ అభిప్రాయాలను మేము ఆమోదించలేము. పన్నుభారం కేవలం యూరోపియన్ల మీద మాత్రమే పడుతుందని మేము భావించడం లేదు. ఈ కొత్త పన్ను విధించడంవల్ల అధికసంఖ్యలో ఈ దేశప్రజలు బాధించబడరనే నెపంతో సత్యం కోసం, న్యాయం కోసం పోరాటం చెయ్యకుండా మౌనంగా ఉండలేము. ఆదాయం పన్నుకు వ్యతిరేకంగా స్థానిక పత్రికలు గళంవిప్పకుండా ఉండి ఉంటే అవి తమ బాధ్యతను,