పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

83


కర్తవ్యాన్ని విస్మరించినట్లు అయ్యేది. వినయంగా మేము వినిపిస్తున్న వాదనలో స్థానికుల ప్రయోజనాలు, యూరోపియన్ల ఆసక్తులు సమప్రాముఖ్యం కలిగి ఉంటాయి. ఈ దేశ ప్రజల సమస్యలను వివేకంతో మా పత్రికలో చర్చించాము. ఎంతో సమర్థవంతంగా, గౌరవప్రదంగా నిర్వహించబడుతున్న మా సోదర పత్రిక అభిప్రాయపడినట్లు ఆదాయంపన్ను యూరోపియన్ల ప్రత్యేక సమస్య కాదు. ఈ దేశంలో 40 రూపాయల అతితక్కువ సంవత్సరాదాయంతో బతుకులీడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. సెలెక్ట్ కమిటీ (Select Committee) ప్రవేశపెడుతున్న సవరణల దృష్ట్యా ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పన్నువడ్డన రుచి చూడబోతారు. ఈ పన్ను మూలంగా ఎన్నో కుటుంబాలు కలవరపాటు చెందుతాయి. మరెన్నో కుటుంబాలు తిండికి బట్టకు కటకటలాడవలసి వస్తుంది. ఈ విషయం అస్పష్టమైన, న్యాయసంబంధమైన సమస్య అని భావించినా, యూరోపియన్ సమాజంమీద మాత్రమే భారంమోపడం అని అనుకొన్నా, మనదేశ ప్రజల కష్టాలకు, ఇబ్బందులకు కారణం అయినా ప్రభుత్వం తలపెట్టిన ఈ పన్ను వ్యవహారాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది. తన హక్కుగా భావిస్తూ, ఈ దేశ ప్రజలను ఆదాయంపన్ను చెల్లించమని కోరడానికి ప్రభుత్వానికి యోగ్యత ఉందా ?

ప్రజలందరు దేశరక్షణను బలపరచడం కోసం, శాంతిని కాపాడుకోడం కోసం యథాశక్తి పన్ను చెల్లించాలని కోరడం ఒక్కటే ఈ కొత్త పన్నును సమర్ధించే అంశం. ప్రభుత్వం పిలుపిస్తే, ప్రతి పౌరుడు ప్రభుత్వకోశానికి కొంత మొత్తం జమ చేయవలసినదే. దేశ రక్షణ కోసం మన ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వమని కోరేవారు తమ ప్రవర్తనతో మన విశ్వాసాన్ని చూరగొనాలి. ఉత్తమాటలతో కాదు; గట్టిచేతలతో, సత్ప్రవర్తనతో తమ మీద ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయకుండా, ప్రజాధనంలో ఒక్కపైసా కూడా వృథా కాకుండా చూస్తారనే నమ్మకం కలుగజేయాలి. ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు విశ్వాసం కలుగజేసే విధంగా ప్రవర్తించారా? ప్రజలు తమ మీద ఉంచిన విశ్వాసాన్ని నిరూపించుకొన్నారా? మనదేశ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం ఏలుబడిలో ఎంతో విధేయతతో ప్రవర్తిస్తారు. మన విధేయత వాస్తవాలు గ్రహించడంలో అడ్డం రాకూడదు. దేశ అవసరాలను గమనించుకొంటూ, ప్రజలను కాపాడుతూ, ప్రభుత్వాన్ని నడిపే వదాన్యులైన మన పాలకులు ప్రభుత్వవ్యయం రోజురోజుకు పెరిగిపోతున్నదని సాధారణంగా వినిపించే ఆరోపణను చాలా తేలికగా తీసుకొంటారు. మనపాలకుల అంతరాత్మకు బాగా సర్దుకుపోయే గుణం ఉంది. అనంతమైన కష్టనష్టాలను ఎదుర్కొంటున్న ఈ నిరుపేద దేశాన్ని విడుపు లేకుండా దుర్వ్యయంలోకి నెట్టివేస్తున్న అనేక ఉదంతాలు మనకు కనిపిస్తాయి. గడిచిన రెండేళ్ళ కాలాన్ని పరిశీలిస్తే, బాధ్యతారహితంగా, విచ్చలవిడిగా విలాసాలకోసం, ప్రభుత్వం ఢిల్లీ రాయల్ దర్బారు నిర్వహించిన తీరు ఒక ఉదాహరణ. ఈ పరిస్థితికి నొచ్చుకొంటూ ఒక్క ప్రభుత్వ అధికారి అయినా తన పదవికి రాజీనామా చేశాడా? ఇంత దర్పం, ఆడంబరం