పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

77


నెలకొనిఉన్న స్నేహభావాన్ని దురాగ్రహంతో భంగపరుస్తున్నాడని అతణ్ణి నిందించాడు. ఈ సంపాదకీయం తెలుగు అనువాదం :-

రెండు చిత్రాలు

“కొన్ని నెలల క్రితం జరిగిన సంగతి. ఈ ఉపన్యాసకుడు కలకత్తా టౌన్‌హాల్లో మాట్లాడుతూ బెంగాలీ బాబులను వట్టి చాడీకోరులని, నీచులని, దుష్టులని హేళన చేశాడు. వారు వట్టి అవినీతిపరులైన మాయగాళ్ళని, అసమర్థులైనా మహా నైపుణ్యం ఉన్న వారిలాగా నటిస్తారని నిందించాడు. ఈ ఉపన్యాసకుడే బర్మింగ్‌హాంలో వేదికమీద తెలివిగా ఇంకో యుక్తిని ప్రదర్శించాడు. ఈసారి టోకున తిట్లకు దిగలేదు. మోతాదు మించకుండా అపహాస్యం చేశాడు. అసూయాపరుడైన కవి అలెగ్జాండర్ పోప్ తన మిత్రుడు ఎడిసన్‌ను చాటుమాటు మాటలతో వ్యంగ్యంగా ప్రస్తావించినట్లు, అస్పష్టంగా పొగడుతున్నట్లే నిందకు పూనుకొన్నాడు. మాకు “ఈ రెండు చిత్రాలు” వినోదం కలిగిస్తున్నాయి. పోలికల్లో బర్మింగ్‌హేం బ్రాన్సన్‌కు, కలకత్తా బ్రాన్సన్‌కు పొంతనే లేదు. కలకత్తా బ్రాన్సన్ చాలా కీతాగా కనిపిస్తాడు. మొక్కట్లు ఒకటేగాఉన్నా ధోరణి వేరుగా ఉంది. బిగిసిన పిడికిళ్ళతో, భయం కొలిపే హావభావాలతో, ఉద్రేకం, అపహాస్యం కలగలిసిన కంఠస్వరంతో, నిగ్రహంలేని తీవ్ర పదజాలంతో, నింద తొంగిచూచే విశేషణాలతో కలకత్తా టౌన్‌హాలు బ్రాన్సన్ ఫోటోగ్రాఫ్ మన ముందు నిలుస్తుంది. సుతిమెత్తని పొగడ్తలతో “మాగ్నాకార్టా” (Magnacharta) సహకారంతో, వ్యక్తిత్వానికి, స్వేచ్ఛకు సంబంధించిన ప్రాచీన ఆలోచనలతో సంయమనం, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ, నెమ్మదితనం తొణికిసలాడే భాషలో, కలకత్తా ఉపన్యాసంలోని డాంబిక పదజాలం లేకుండా మాట్లాడే వ్యక్తిగా బర్మింగ్‌హాం చిత్రంలో కనిపిస్తాడు !

ఇంతకూ అసలీ బ్రాన్సన్ ఎవరు? ఇతగాడు కలకత్తా బార్లో (Calcutta Bar) సభ్యుడు. ఆ హోదా ఇతనికి ఎంతో గౌరవం కలిగించింది. ఇతను మద్రాసు వాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువు సంధ్యలు నేర్చాడు. మొదట వెపేరీ గ్రామర్ స్కూలు (Vepery Grammar School) లో చదివాడు. హాలీ (Mr.Halley) కాలంలో డోవిటన్ కాలేజి (Doveton College) విద్యార్థి. తర్వాత ఇంగ్లాండు వెళ్ళాడు. తన సంగతి మద్రాసులో అందరికీ తెలుసు గనుక, తెలివిగా కలకత్తా వెళ్ళి అక్కడ బార్లో సభ్యుడయ్యాడు. హుగ్లీ పెద్దమనుషులు ప్రసిద్ధికెక్కిన ఇతని ఉపన్యాసం విని పెద్దగా కేకలువేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరచారు. సర్ ఛార్లెస్ ట్రెవిలియన్ (Sir Charles Trevelyan) కు ఎంతో “గౌరవప్రదమైన” కూవంనది ప్రవహించే చెన్నపట్నంలో అయితే ఈ ఉపన్యాసాన్ని అసలు సహించి ఉండరు. ఇతని తండ్రి ఫారో అండ్ కో (Pharoah & Co.,) లో భాగస్వామి. జాన్ బ్రూస్ నార్టన్ (John Bruce Norton) సంపాదకత్వంలో ఎథీనియం