పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

67


1875లో మద్రాస్ విడో మ్యారేజ్ అసోసియేషన్ వితంతు వివాహాలమీద ఒక సభ నిర్వహించింది. పరవస్తు వెంకటరంగాచార్యులు విశాఖపట్నం నుంచి సభకు రావడమే కాక, స్త్రీ పునర్వివాహం శాస్త్ర సమ్మతమని సమర్థిస్తూ పుస్తకం రాసి ప్రకటించాడు.32 అంతకంటే ముందే బందరు పత్రిక 'పురుషార్ధ ప్రదాయిని' లో వితంతు వివాహాలను సమర్థిస్తూ వ్యాసాలు వెలువడ్డాయి. వేద సమాజపత్రిక 'తత్త్వబోధిని' లోను కొన్ని వ్యాసాలు వచ్చాయి. వీరేశలింగం స్త్రీ పునర్వివాహాలను సమర్థిస్తూ అనేక వ్యాసాలు రాసి, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలచడానికి ప్రయత్నించాడు.

పాతతరం సంస్కరణవాదుల్లో రంగనాథశాస్త్రి చనిపోయాడు. రామయ్యంగారు తిరువాన్కూరు దివాను పదవిని అంగీకరించి మద్రాసు విడిచిపెట్టాడు. ఆ సమయంలోనే ఆర్. రఘునాథరావు డెప్యూటీ కలెక్టరుగా మద్రాసు తిరిగి వచ్చాడు. ఆయనకు ప్రభుత్వ పాలనలో విశేషానుభవం ఉంది. మద్రాసులో అడుగు పెట్టగానే సంస్కరణోద్యమంలో మనస్ఫూర్తిగా నిమగ్నమయ్యాడు. ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో ఆయనలో సంస్కరణ మీద ఆసక్తి మొదలైంది. హిందువులు స్వచ్ఛమైన వైదికాచారాలను వదిలిపెట్టి మూఢనమ్మకాలవైపు ఆకర్షించబడ్డారని ఆయన పరిశీలనలో తేలింది. శాస్త్రాచారాలకు దూరం కావడంవల్ల స్త్రీలను అణచివేసే దురాచారాలు హిందూ సమాజంలో తలఎత్తాయని, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం మొదలైన అంధ విశ్వాసాలకు హిందూ శాస్త్రాల ఆమోదంలేదని గ్రహించాడు. వేద యుగానంతరం వెలువడిన వ్యాఖ్యానాలు, విమర్శలు అనేక అపార్థాలకు తావిచ్చాయని, దక్షిణ భారతదేశంలో మూర్ఖంగా సంప్రదాయాన్ని నమ్మేవారివల్లే సంస్కరణ పురోగమించడం లేదనే నిశ్చయానికి వచ్చాడు. రఘునాథరావుకు ఇంగ్లీషు విద్యావంతుల మీద గూడా భ్రమ తొలగిపోయింది. మొదట్లో ఇంగ్లీషు విద్యావ్యాప్తి వల్ల సంస్కరణోద్యమం బలపడుతుందని ఆయన భావించాడు. ఇంగ్లీషు నేర్చిన యువకులు పాశ్చాత్య సంస్కృతి మోజులో తమ మతాన్ని, జీవనవిధానాన్ని చులకన చేసి తృణీకరిస్తున్నారని, విగ్రహారాధనను నిరాకరించి నాస్తికులుగా మారుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఈ యువకులు అభిలషిస్తున్న తీవ్రమైన మార్పులు హిందూ సమాజానికి చెడుపు చేస్తాయని, శాస్త్ర గ్రంథాల ఆధారంగా నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకొని రావచ్చునని విశ్వసించాడు. ఆయన సంస్కరణ అనే మాటను కూడా వాడడానికి ఇష్టపడలేదు. దానికి బదులు “మన జీవితానికి సంబంధించిన ప్రాచీన సూత్రాలు” అని వాడుక చేశాడు. శాస్త్రం ఆమోదం లేకుండా హిందూ సమాజాన్ని మార్చడం సాధ్యంకాదని, సంప్రదాయ వాదులను నొప్పించకుండానే సంస్కరణ, మార్పు నిదానంగా రావాలనే నిర్ణయానికి వచ్చాడు. పళ్ళె చెంచలరావు, మద్రాసు హైకోర్టు వకీలు సుబ్రహ్మణ్యంఅయ్యరు మొదలైన ఈయన మిత్రులు ఈ అభిప్రాయాలను సమర్థించారు. వీరి ఆలోచనలతో ఏకీభవించనివారు