పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

దంపూరు నరసయ్య


మద్రాసు సంస్కరణోద్యమ నాయకులకు విజ్ఞప్తి చేశాడు. శేషయ్యంగారి కృషి మద్రాసులో మార్పును కోరుతున్న విద్యావంతుల హృదయాలను కదిలించినట్లుంది.29

హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్

1874 ఏప్రిల్‌లో మద్రాసు హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్ స్థాపించడం కోసం ఒక సమావేశం ఏర్పాటైంది. ఈ సమాజాన్ని స్థాపించడంలో రామయ్యంగారు, ముత్తుస్వామి అయ్యరు కృషి చాలా ఉంది. వాళ్ళిద్దరూ సమాజ కార్యవర్గ సభ్యులుగా, పళ్ళె చెంచలరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. స్త్రీ పునర్వివాహాలు ప్రోత్సహించడం ఈ సమాజ ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. విధవా వివాహాలకు శాస్త్రగ్రంథాల ఆమోదం ఏ మేరకు ఉందని పరిశీలించడం వరకే ఈ సమాజ కార్యక్రమాలు పరిమితం కావాలని పనప్పాకం అనంతాచార్యులు, ఆర్. రఘునాథరావు వాదించారు. వారికి సంప్రదాయ హిందువుల మనోభావాలను గాయపరచడం ఇష్టం లేదు. సభ్యులలో అధిక సంఖ్యాకులు ఈ ప్రతిపాదనలను తిరస్కరించడం వల్ల వీరిద్దరూ ఈ సమాజంలో సభ్యులుగా చేరనే లేదు. మద్రాస్ హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్ సభ్యులు వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతం అయితేనే విజయవంతం అవుతాయని విశ్వసించారు. ఈ దిశలో వితంతు వివాహాలకు అనుకూలంగా ఉన్న శాస్త్ర గ్రంథాలలోని విషయాలను ముందుగా ప్రచురించడానికి పూనుకొన్నారు. అప్పటికి ఈ సంస్కరణవాదులు కులవ్యవస్థను వ్యతిరేకించలేదు. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించలేదు. హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్ ఈ పరిమిత లక్ష్యాలు కూడా కార్యరూపం ధరించలేదు. హిందూ సమాజం నుంచి వీరికి ఎటువంటి ప్రోత్సాహం లభించక పోవడంవల్ల, ఈ సంస్థ కార్యక్రమాలు వెనకబడిపోయాయి.30

మద్రాస్ విడో మ్యారేజ్ అసోసియేషన్ సభ్యులకు పట్టుదల లేదని, ఇంగ్లీషు అధికారుల మెప్పుకోసమే ఈ సమాజాన్ని స్థాపించారనే విమర్శలు వచ్చాయి. ఈ సమాజ సభ్యులు బహిరంగసభల్లో, పత్రికల్లో వ్యక్తపరచిన ఆశయాలను ఆచరణలో పెట్టలేని పిరికివాళ్ళనే మాటలు పుట్టాయి. అసలు సంగతి, ఈ సంస్థ సభ్యులు సంప్రదాయవాదులతో ముఖాముఖి తలపడడానికి ఇష్టపడలేదు. మద్రాసు బ్రాహ్మణుల్లో ఎక్కువమంది బాల్యవివాహాలను నిరసించే వారే అయినా, ఆచరణలో సంప్రదాయాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించకుండా, నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. రంగనాథశాస్త్రి, ముత్తుస్వామి అయ్యరు, రామయ్యంగారు వంటి విద్యాధికులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా మూఢ నమ్మకాలను, దుష్ట సంప్రదాయాలను ఎదిరించడానికి జంకుతున్నారని, బాధ్యతలనుంచి తప్పుకొంటున్నారని పత్రికలలో విమర్శలు వచ్చాయి. వీరు సంస్కరణలకు అనుకూలమే అయినా సంప్రదాయవాదులను నొప్పించకుండా మార్పు తీసుకొని రావాలని ప్రయత్నించారు.31