పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

దంపూరు నరసయ్య


“హేతువాదులు” గా ముద్రపడ్డారు. ఈ వర్గంవారు మార్పుకు తర్కం, ఇంగిత జ్ఞానం పునాది కావాలని భావించారు. నరసయ్య ఈ భావజాలానికి చెందినవాడని అనిపిస్తుంది.33

రఘునాథరావు మద్రాసుకు రావడంతో హిందూ మ్యారేజ్ అసోసియేషన్ పునరుద్ధరించబడింది. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించేవారే సంస్థలో ప్రధాన కార్యకర్తలు అయ్యారు. రఘునాథరావు అధ్యక్ష పదవి చేపట్టాడు. పదేళ్ళ కన్నా తక్కువ వయసు బాలికలకు వివాహం చేయడాన్ని ఈ సంస్థ అంగీకరించలేదు. వివాహమై కొంతకాలం సంసారం చేసిన స్త్రీలకు వేదమంత్రాలు పునర్వివాహం అంగీకరించలేదని, కన్యలైన వితంతువులకు మాత్రమే శాస్త్రం వివాహ విధిని అంగీకరించినట్లు ఈ సంస్థ అభిప్రాయపడింది. వితంతువులు పునర్వివాహం చేసుకొంటే తొలి భర్త ఆస్తిమీద హక్కు పోతుందనే కారణంతో, వితంతు బాలికల పునర్వివాహాలకు కన్నవారే అడ్డుపడుతున్నారని, అందువల్ల 1856 హిందూ వివాహ చట్టాన్ని సవరించవలసి ఉందని ఈ సంస్థ భావించింది. ఉత్తర సర్కారు జిల్లాలలో వీరేశలింగం ప్రారంభించిన వితంతు పునర్వివాహ కార్యక్రమంతో ప్రేరణపొంది, వితంతు వివాహాలు కుదిర్చినవారికి, అర్హులైన కన్యల వివరాలు తెలియజేసినవారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని సంస్కరణకు అనుకూలంగా మలచడంలో రఘునాథరావు, ఆయన మిత్రులు ఈ సంస్థ ద్వారా కృషి చేశారు.34

వీరేశలింగం తొలి వితంతు వివాహం జరిపించిన నాలుగో రోజే రెండో వితంతు వివాహం జరిపించాడు. దాంతో రాజమండ్రి సంప్రదాయ బ్రాహ్మణ వర్గం వీరేశలింగంమీద చర్య తీసుకొన్నది. ఈ వివాహాలతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ వెలివేసింది. స్థానిక పీఠాధిపతి సంస్కరణవాదులను వెలివేస్తూ పత్రికలు పంపాడు. వీటిని ఎదుర్కొనే శక్తి లేక కొందరు ప్రాయశ్చిత్తం చేసుకొన్నారు. వీరేశలింగం ఆయన అనుచరులు కొద్దిమంది మాత్రమే ఈ కష్టాలు సహించి నిలబడగలిగారు.35

రాజమండ్రిలో జరిగిన పునర్వివాహ వార్తలు విని మద్రాసు సంస్కరణవాదులు ఎంతో సంతోషించారు. వీరేశలింగాన్ని అభినందిస్తూ లేఖలు రాశారు. చెన్నపట్నం వచ్చి ఈ వేడి చల్లారక మునుపే కొన్ని ఉపన్యాసాలు చేయవలసిందని వీరేశలింగాన్ని ఆహ్వానించారు. ఆయన ఉపన్యాసాల ప్రభావంతో మద్రాసులో కూడా కొన్ని వితంతు వివాహాలు జరగవచ్చునని రఘునాథరావు, ఆయన మిత్రులు భావించారు.36

వీరేశలింగాన్ని మద్రాసుకు పిలిపించడానికి పళ్ళె చెంచలరావు కృషిచేశాడు. “మాతో సహ భోజనమున కేర్పాటుచేసి మాకు ప్రోత్సాహము కలిగించుటకయి చెంచలరావు పంతులుగారు మమ్మచటకు రమ్మని ఆహ్వానము చేసిరి” అని వీరేశలింగం స్వీయచరిత్రలో