పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

29


విభేదిస్తే, సంతృప్తికరమైన నిర్ణయానికి రావడం కష్టమని అంటారు. ఈ సంవాదంలో పాల్గొంటున్నవారు మహామేధావులు. వారు ఆర్జించిన పాండిత్యాన్ని మనం బోధపరచుకొన్నా, అనాదిగా సమకూడిన జ్ఞానసంపదను సాధించినా, ఈ వివాదంలో పాల్గొంటే మమ్మల్ని వారు స్వాతిశయంతో మిడిసిపడుతూ చురుకైన వాగ్బాణాలు సంధించే అహంభావిగా భావిస్తారు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళని మొండిగా వాదించేవాణ్ణని అనుకొంటారు. ఇతరుల తగాదాలలో అనవసరంగా జోక్యం చేసుకొంటే, గొడవపడుతున్నవారి మోచేతులు తగిలి ముక్కు పచ్చడవుతుందన్న చందంగా, ఎంతో సుకుమారమైన మా ఘ్రాణేంద్రియాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ ఉదయం మేము వివాదాస్పదమైన రంగస్థలంమీద అడుగు పెడుతున్నాము. ఈ తొందరపాటు చర్యవల్ల తప్పనిసరిగా మేము ఏదో ఒక పక్షంవైపు నిలబడవలసి వస్తుంది. ఒక వర్గం మమ్ములను స్నేహితుడుగా భావిస్తే, రెండోవర్గం నిష్కారణంగా వివాదంలో జోక్యం చేసుకొన్న వ్యక్తిగా తలచి దూషిస్తుంది. “ఒక సాధారణ ప్రేక్షకుడుగా ఉండి ప్రపంచాన్ని బోధపరుచుకోవాలని భావించడం బుద్ది తక్కువ పని” అని మహానుభావుడైన ఒక ఫ్రాన్సుదేశపు తత్త్వవేత్త అన్నాడు. ఆలంకారికంగానే అయినా, ముక్కు పగిలి, రక్తసిక్తం కావడానికి మేము సిద్దపడి, బాల్యవివాహాలను వ్యతిరేకిస్తున్న శాస్రుల తరఫున - శాస్త్రాలు చక్కగా అనుశీలనంచేసి, బాల్యవివాహాలను సమర్ధిస్తున్న ఉత్సాహవంతులకు వ్యతిరేకంగా రంగప్రవేశం చేస్తున్నాము.

అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం, హిందూ బాలికలకు శైశవంలోనే వివాహం చెయ్యడమా? లేకపోతే, విజ్ఞానం చక్కగా అభివృద్ది చెందిన ఈనాటి స్పూర్తితో, ఏషియా నాగరిక సమాజాల్లో, యూరపు అంతటా అమలులో ఉన్న, ఆచరణయోగ్యమైన, సులభమైన పద్దతిని అనుసరించడమా? ఇదే హిందువుల ముందున్న అసలు సమస్య. ఈ చరణాలు అంత అందంగా లేకపోయినా, విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నాయి.

హిందూ స్త్రీలు

అర్హుడైన వరుణ్ణి ఎన్నుకోడం మాత్రమే కాదు;
వివాహయోగ్యమైన వయస్సును కూడా ఎంచుకోవాలి.

ఇదీ అసలుసమస్య. వెంకన్నశాస్త్రి, ఆయన మిత్రుడు, పీఠాధిపతి శ్రీమత్ శంకరాచార్యులు ఏ మాత్రం మార్పు లేకుండా సంప్రదాయాన్ని కొనసాగించాలని వాదిస్తారు. రంగనాథశాస్త్రి, ఆయన మిత్రుడు అనంతరామశాస్త్రి ఈ సంప్రదాయాన్ని రద్దుపరచాలని కోరుతున్నారు. మేమూ ఆమాటే అంటున్నాము. రంగనాథశాస్త్రి, ఆయన మిత్ర బృందం తమ వాదానికి రుజువుగా మనుధర్మశాస్త్రంలోని సూత్రాలను నిదర్శనంగా చూపుతున్నారు. వెంకన్నశాస్త్రి బృందం తమ అభిప్రాయాలకు అనుకూలంగా అవే ప్రమాణాలను ప్రదర్శిస్తున్నారు. హిందూ మిత్రులందరి మాదిరే, మనం ఒకే ఆకరాన్ని