పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

దంపూరు నరసయ్య

ఈ లేఖ 1865 ఆగష్టు 7వ తేది మద్రాస్ స్టాండర్డు (Madras Standard) లో ప్రచురించబడింది. లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్ పుస్తకం ముఖపత్రంమీద "Being a reprint of the letters that appeared in the Madras Times some time back upholding infant marriages among Hindus" అని ఉంది కాని మద్రాస్ స్టాండర్డు ప్రస్తావన లేదు. ఈ పత్రిక ప్రస్తావన మద్రాసు జర్నలిజం చరిత్రలలో కనిపించదు, పందొమ్మిదవ శతాబ్ది చివర పరమేశ్వర పిళ్ళె సంపాదకత్వంలో వెలువడిన మద్రాస్ స్టాండర్డు ప్రస్తావన మాత్రమే కనిపిస్తుంది. అసైలం ప్రెస్ ఆల్మనాక్‌లలో 1865 నుంచి వరుసగా ఈ పత్రిక ప్రస్తావన ఉంది. పత్రిక ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం వెలువడేది. అన్ని ఉత్తరాలు మద్రాస్ టైమ్స్‌లో ప్రచురించి, ఈ ఒక్క ఉత్తరాన్ని ఈ పత్రికకు ఎందుకు పంపవలసి వచ్చిందో కూడా తెలియదు. లేఖ చివర ఎవరిపేరూ లేదు. నరసయ్య సొంత అభిప్రాయాలు, ఆలోచనా ధోరణి ఈ లేఖలో వ్యక్తమయ్యాయి. ఆయన శాస్త్ర గ్రంథాల సహాయంతో సంస్కరణను సమర్ధించే వర్గానికి చెందడు. సమాజానికి మేలు చేకూర్చే మార్పును హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. మద్రాసు సంస్కరణవాదులు తర్వాత కాలంలో మితవాదులుగా, అతివాదులుగా ముద్రపడ్డారు. నరసయ్య అతివాద వర్గంతో ఉండి ఉండవచ్చని ఈ లేఖలో వ్యక్తమయిన ధోరణి సూచిస్తుంది. ఒకవైపు తనబావ వెంకన్నశాస్త్రికి అండగా ఉంటూ, ఆయన అభిప్రాయాలను ఆయన పేరు మీదనే సంపాదకీయ లేఖలు రాసి వివరించాడు. మద్రాస్ స్టాండర్డుకు రాసిన ఈ లేఖలో స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు; ఈ వైజ్ఞానిక యుగంలో పాతపడి వాడుకలో నుంచి తొలగిపోయిన ధర్మశాస్త్రాల ప్రామాణ్యాన్ని నిరాకరించాడు. ఒక సంప్రదాయం సమాజానికి కీడు కలిగిస్తున్నపుడు దాన్ని అనుసరించడంలో సబబును ప్రశ్నించాడు. అభివృద్ధి చెందుతున్న జాతులతోపాటుగా నూతన భావాలను అలవరచుకొని, సనాతన భావాలను, దుష్ట సంప్రదాయాలను ధైర్యంగా విడిచిపెట్టి ముందుకు సాగాలని సూచించాడు. ఈ లేఖ రాసేనాటికి నరసయ్యకు సమాజాన్నిపట్టి వీడిస్తున్న సాంఘిక దురాచారాలమీద మంచి అవగాహన ఉన్నట్లనిపిస్తుంది. బాల్యవివాహాలవల్ల, వితంతువివాహాల నిషేధంవల్ల సమాజంలో వ్యభిచారం అనేక రూపాల్లో వ్యాపించి ఉందని పేర్కొన్నాడు. నరసయ్య లేఖకు తెలుగు అనువాదం :

“ముగ్గురు శాస్త్రులు, ఒక ఆచార్యులు; వెంకన్నశాస్త్రి, రంగనాథశాస్త్రి, అనంతరామశాస్త్రి, పూజ్యులు, ఆధ్యాత్మిక పీఠాధిపతి శ్రీమత్ శంకరాచార్యులు - మొత్తం నాలుగు పెద్ద తలలు (పైగా చాలా పొడవైన పేర్లు). వీరు ఇష్టంగా పిలిచే “హిందూ శైశవ వివాహాలు' అనే అంశంపైన ఇద్దరు అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా ఉండి బుర్రలు బద్దలు కొట్టుకొంటూ వివాదం సాగిస్తున్నారు. సమకాలిక పత్రిక మద్రాస్ టైమ్స్ 'కాలం' లను యుద్దరంగంగా ఎన్నుకొన్నారు. మహామనీషులు