పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

దంపూరు నరసయ్య


వీరికి వేదాలమీద విశ్వాసం ఉన్నందువల్ల వేదసమాజమని పేరు పెట్టారు. ఈ సమాజానికి వి. రాజగోపాలాచార్యులు, సి. సుబ్బరాయులు సెట్టి, అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఇద్దరూ న్యాయవాదులే. దీనికి తంజావూరు, సేలం, కోయంబత్తూరు, బెంగుళూరులో అనుబంధసంస్థలు ఏర్పడ్డాయి. వేదసమాజ సభ్యులు ఉపన్యాసాలకు, ప్రార్థన సమావేశాలకు తమ కార్యక్రమాలను పరిమితం చేసుకొన్నారు. సనాతన ఆచారాలమీద, ఉపనిషత్కాలం తర్వాత వాడుకలోకి వచ్చిన సంప్రదాయాలమీద విమర్శలు చేయడంవల్ల వేదసమాజం సంప్రదాయవాదులకు, సామాన్య ప్రజలకు దగ్గరకాలేక పోయింది. అధ్యక్ష కార్యదర్శులు మరణించిన తర్వాత, ఈ సమాజం కొంతకాలం నిద్రాణంగా ఉండిపోయింది. మద్రాసు ప్రెసిడెన్సీలో మత సాంఘిక సంస్కరణల మిద చర్చను, జిజ్ఞాసను రేకెత్తించడంలో మాత్రం వేదసమాజం సఫలమైంది.

సి.వి. రంగనాథశాస్త్రి (1819-1881)

వేదసమాజం స్ఫూర్తితో కలమూరు వెంకట రంగనాథశాస్త్రి, ఆయన మిత్రులు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. రంగనాధశాస్త్రి చిత్తూరుజిల్లాలో ఒక పండిత కుటుంబంలో జన్మించాడు. పావెల్ పర్యవేక్షణలో 1842లో అత్యున్నతశ్రేణిలో ప్రొఫిషియెంట్' (proficient) గా హైస్కూలు చదువు పూర్తిచేసి, మద్రాసు హైకోర్టులో ఉద్యోగ జీవితం ఆరంభించాడు. అనేక యూరోపియన్ భాషలు నేర్చుకొన్నాడు. 1859లో మద్రాసు స్మాల్‌కాజ్‌కోర్టులో జడ్జి పదవి చేపట్టాడు.

రంగనాథశాస్త్రి విద్యాభిమాని. పాశ్చాత్య విద్యావిధానం ఆయన ఆలోచనల మీద గాఢమైన ప్రభావం చూపింది. ప్రజలు విద్యావంతులైన నాడే దేశం అభివృద్ది చెందుతుందని గట్టిగా నమ్మాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. తన కుమార్తెకు చదువు చెప్పించాడు. హిందూ మతగ్రంథాలను అనుశీలనంచేసి, ఆ మతం ఉత్కృష్టమైనదని గ్రహించాడు. ఆయనకు వర్ణభేదాలమీద విశ్వాసం తొలగిపోయింది.2 వేదసమాజం కలిగించిన స్పూర్తితో హిందూసమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలను పరిశీలించాడు. ఈ విషయంలో శాస్త్రగ్రంథాలేమంటున్నది తెలుసుకోడానికి కృషి చేశాడు. ఈ అనుశీలనంతో బాల్యవివాహవ్యవస్థ దారుణమైనదని గ్రహించాడు. .

బాల్యవివాహాలు నిరసిస్తూ దక్షిణ భారతదేశంలో రచించబడిన తొలిపుస్తకం ఏదో స్పష్టంగా తెలియడంలేదు. కేశవచంద్రసేన్ మద్రాసు వచ్చిన సంవత్సరమే వితంతువివాహాలను నిరసిస్తూ, తెలుగులో ఒక పుస్తకం వెలువడినట్లు తెలుస్తూంది. “హిందూవివాహ శాస్త్రసంగ్రహం” అనే అనువాద గ్రంథం మనుస్మృతిని ఉల్లేఖిస్తూ, రజస్వలానంతర వివాహాలను, వితంతువివాహాలను శాస్త్రాలు అనుమతించాయని, వాటిమీద నిషేధంలేదని తెలియజేసింది. కలియుగంలో "ఆయుస్సు తక్కువ గనుక ఆడపిల్లలకు 16 యేండ్ల లోపల పెండ్లి చేయకపోవడం వాంఛనీయం, యెట్టి