పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

21


పరిస్థితులలోను 12 ఏండ్లలోపల చేయకూడదు” అని గ్రంథ రచయిత వాదించినట్లుంది.3 సామినేని ముద్దునరసింహం 1862 ప్రాంతంలో ‘హితవాది' పత్రికలో సాంఘిక విషయాల మీద అనేక వ్యాసాలు రాశాడు.4 మద్రాసు వేదసమాజ పత్రిక 'తత్త్వబోధిని” లో సంస్కరణ, బాలికావిద్య, వితంతు పునర్వివాహాలు మొదలైన విషయాలమీద వ్యాసాలు ప్రచురించబడ్డాయి. సి.వి. రంగనాథశాస్త్రి తన మిత్రుడు చదలువాడ అనంతరామశాస్త్రిని రజస్వలానంతర వివాహాలు శాస్త్ర సమ్మతమైనవని నిరూపిస్తూ, ఒక పుస్తకం రాయమని ప్రోత్సహించాడు. ఆయన కోరిక ప్రకారం అనంతరామశాస్త్రి "వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్” అనే పుస్తకాన్ని సంస్కృతభాషలో, శ్లోకరూపంలో రచించాడు.

అనంతరామశాస్త్రి (1835-1872 ప్రాంతం)

అనంతరామశాస్త్రి నెల్లూరు పుదూరు ద్రావిడ బ్రాహ్మణుడు. ఆయన అన్న చదలువాడ సీతారామశాస్త్రి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగుపండితుడు. వీరిద్దరూ చిన్నాయనశాస్త్రి, పెదనాయనశాస్త్రి పేర్లతో ప్రసిద్ధులయ్యారు. అనంతరామశాస్త్రి “సకల కళాకోవిద” అల్లాడి రామబ్రహ్మశాస్త్రి వద్ద శాస్త్రాలు అభ్యసించాడు. పండితగోష్ఠులలో, చర్చలలో పాల్గొని కీర్తి గడించాడు. వెంకటగిరి ఆస్థానంలో జరిగిన పండితవాదంలో ఆస్థానపండితుడు తర్కభూషణం వేంకటాచార్యులను ఓడించి, సంస్థానాధిపతి సర్వజ్ఞ కుమారునికి అద్వైతం బోధించినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. “పరమహంస, చిదానందయోగి, గతాగతవేది, సాహిత్యచక్రవర్తి, సాంగోపాధ్యాయుడు” అని హిందూ బాంధవి పత్రిక, ఆయన మరణించిన ఏభైసంవత్సరాల తర్వాత ప్రస్తుతించింది. అనంతరామశాస్త్రి చివరిదశలో సన్యాసం స్వీకరించాడని, శాస్త్రాచారాలను లెక్కపెట్టకుండా 'అస్పృశ్యుల' ఇళ్ళలో కూడా భోజనం చేసేవాడని అంటారు.5 ఆయన 32 సంవత్సరాల వయస్సులో 1872 ప్రాంతంలో మరణించినట్లు ఒంగోలు వెంకటరంగయ్య అభిప్రాయపడ్డాడు.6

వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్

1928లో “దేశీయ సంఘసంస్కరణ సభ” వారి అభ్యర్ధన ననుసరించి, ఒంగోలు వెంకటరంగయ్య ఈ పుస్తకాన్ని తెలుగులో సంగ్రహంగా అనువదించాడు. 1860 శిక్షాస్మృతి, సెక్షన్ 375 ప్రకారం పదేళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరపవచ్చు. ఇంత చిన్న వయసులో బాలికలకు పెళ్ళిచెయ్యడం న్యాయంకాదని కేశవచంద్రసేన్ అలజడి చేస్తూ వచ్చాడు. “బహుశః కేశవచంద్రసేన్ ప్రచారము మద్రాసుకు గూడా వ్యాపించి ఈ చిన్న పుస్తకమునకు కారణమై యుండవచ్చును” అని పుస్తకరచన నేపథ్యాన్ని వెంకటరంగయ్య వివరించాడు.7 సుందరలింగం కూడా తన పరిశోధన గ్రంథంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు.8 వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్ 1866లో శ్రీరామాదర్పణ ముద్రాక్షరశాలలో అచ్చయినట్లు వెంకటరంగయ్య తెలియజేశాడు.