పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

15


స్థాపించుకోడానికి కృషిచేశారు. ఈ నేపథ్యంలోనే 1842లో మద్రాసు నగరంలో పచ్చయ్యప్ప పాఠశాల ప్రారంభం అయింది. హిందువులకు మిషనరీల ప్రచారాన్ని ఎదుర్కోడానికి పత్రిక అవసరం అయింది. సి. నారాయణస్వామినాయుడు అచ్చాఫీసు నెలకొల్పి, నేటివ్ ఇంటర్‌ప్రిటర్ (Native Interpretor) పత్రికను ప్రారంభించాడు. గాజుల లక్ష్మీనరసుసెట్టి తండ్రి నెలకొల్పిన సిద్ధులు అండ్ కో లో ఈయన భాగస్వామి. హిందూసమాజానికి పనికివచ్చే విజ్ఞానదాయకమైన విషయాలు ప్రచురించడం, హిందువుల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనిరావడం పత్రిక లక్ష్యాలుగా నిర్దేశించుకొన్నాడు. మిషనరీల ప్రచారాన్ని ఈ పత్రిక ద్వారా సమర్ధవంతంగా తిప్పికొట్టి, తీవ్రంగా రాస్తూ వచ్చాడు.

1840-68 మధ్యకాలంలో మద్రాసు పౌరజీవితంలో గాజుల లక్ష్మీనరసుసెట్టి ప్రముఖపాత్ర వహించాడు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మత పక్షపాతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందువుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడంలో గొప్ప కృషి చేశాడు. నారాయణస్వామినాయుడునుంచి నేటివ్ ఇంటర్‌ప్రిటర్ పత్రికను కొని క్రెసెంట్ (Crescent) పేరుతో దాన్ని కొనసాగించాడు. ఈ పత్రికకు ఎడ్వర్డ్ హార్లీ (Edward Harley) ని సంపాదకుడుగా నియమించాడు. హార్లీ మద్రాసు వైపేరీలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. విదేశీయుడైనా భారతీయులంటే అభిమానం ఉండేది. మిషనరీల కార్యక్రమాల వల్ల హిందూసమాజానికి ప్రమాదం పొంచిఉందని క్రెసెంట్ రాస్తూ వచ్చింది.

లక్ష్మీనరసుసెట్టి పదిసంవత్సరాలు మిషనరీల మతాంతరీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపాడు. ఆధునిక పద్ధతులలో, అనేక రూపాలలో ప్రజల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన సాగించాడు. ఈయన ఆధ్వర్యంలో కలకత్తాలో స్థాపించబడిన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఒక సంస్థ నెలకొల్పబడింది. కొంతకాలానికి ఇది మద్రాసు నేటివ్ అసోసియేషన్ (Madras Native Association) పేరుతో స్వతంత్ర సంస్థగా రూపొందింది. లక్ష్మీనరసుసెట్టి, ఈయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె ఈ సంస్థ తరపున బ్రిటిష్ పార్లమెంటుకు ఒక మహజరు తయారు చేశారు.

మద్రాసు తెలుగువారిలో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె ప్రముఖుడు. ఇంగ్లీషు చదువుకోకపోయినా, విచక్షణాజ్ఞానం, ఉదారస్వభావం ఉన్నవాడు. సంపన్నకుటుంబంలో జన్మించాడు. తన కాలాన్ని, సంపదను ప్రజల హితంకోసం వినియోగించాడు. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాశ్చాత్య విద్య దోహదపడుతుందని గ్రహించాడు. ఈయనకు స్త్రీవిద్యమిద అభిమానం ఉండేది. మద్రాసు ప్రముఖులు ఏనుగుల వీరాస్వామి, వెన్నెలగంటి