పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

దంపూరు నరసయ్య


సుబ్బారావు, వెంబాకం రాఘవాచారి మొదలైన ఆయన మిత్రులు కూడా ఉదారస్వభావులు. పాశ్చాత్యుల పరిచయాలు, జార్జి నార్టన్ (George Norton) స్నేహం వీరి ఆలోచనలలో మార్పు తెచ్చింది. నార్టన్ మద్రాసు సుప్రీంకోర్టులో అడ్వొకేట్ జనరల్‌గా ఉండేవాడు. మార్పును అభిలషించే హిందువులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. ఆయన ఇంట్లో జరిగే గోష్ఠులు, చర్చలు ఈ హిందూ మిత్రులమీద ప్రభావం చూపాయి. పాశ్చాత్య విద్య అభ్యసించడం వల్ల హిందువులు ఉన్నతోద్యోగాలు పొందగలరని, రాజకీయ ప్రయోజనాలు సాధించుకోగలరని నార్టన్ భావించాడు.14 ఆయన ప్రోత్సాహంతో శ్రీనివాసపిళ్ళె, ఇతర మిత్రులు మద్రాసు హిందూ లిటరరీ సొసైటీ (Madras Hindu Literary Society) ప్రారంభించారు. ఆ సొసైటీ సమావేశాలలో నార్టన్, మరికొందరు యూరోపియన్ మేధావులు - చరిత్ర, రాజకీయశాస్త్రం, సాహిత్యం మొదలైన అనేక విషయాల మీద ఉపన్యసించేవారు. ఈ ఉపన్యాసాలు విద్యావంతులైన యువకుల ఆలోచనల్లో మార్పును తీసుకొచ్చాయి. ప్రజలు ఆధునిక విద్య అవసరాన్ని గుర్తించారు. హిందూ లిటరరీ సొసైటీ పర్యవేక్షణలో మద్రాసులో ఒక ఇంగ్లీషు బోధించే స్కూలు ప్రారంభం అయింది. “గౌరవప్రదమైన” కులాల విద్యార్థులు ఈ స్కూలుకు వెళ్ళి చదువుకోవడం మొదలు పెట్టారు. నార్టన్, శ్రీనివాసపిళ్ళె మొదలైన వారి కృషివల్ల 1841లో మద్రాసు యూనివర్సిటీ హైస్కూలు ప్రారంభమయింది. ఈ స్కూలు ప్రెసిడెన్సీ కాలేజీగా అభివృద్ధి చెందింది.

సంస్కరణ విషయంలో లక్ష్మీనరసుసెట్టి, శ్రీనివాసపిళ్ళెల మధ్య అభిప్రాయభేదాలు తలఎత్తాయి. లక్ష్మీనరసుసెట్టి పాశ్చాత్యీకరణను వ్యతిరేకించాడు. మార్పు హిందూసమాజం అంతర్గతంగా రావాలని, వెలుపలినుంచి కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. బాలికలకు చదువులేకపోవడం, వారికి ఆస్తిహక్కు లేకపోవడం, అతి బాల్యవివాహాలు, వితంతు వివాహాల నిషేధం, సముద్రయానం మీద నిషేధం మొదలైన దురాచారాలు, మూఢనమ్మకాలు రద్దుకావడానికి ప్రభుత్వజోక్యం తప్పనిసరి అని శ్రీనివాసపిళ్ళె భావించాడు. ఈ అభిప్రాయ భేదాలవల్ల శ్రీనివాసపిళ్ళె, లక్ష్మీనరసుసెట్టితో విడిపోయి, 1852లో హిందూ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటి (Hindtu Progressive Improvenient Society)ని స్థాపించాడు. ఈ సొసైటీ తరపున స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, వితంతువివాహాలను నిర్వహించాలని, అణగారిన బడుగువర్గాల అభివృద్ధికి కృషిచెయ్యాలని తలపెట్టాడు. ఈ కార్యక్రమంలో సదర్ కోర్టు (Sadar Court) లో ప్లీడరయిన ఎం.వెంకటరాయులునాయుడు ఆయనకు అండగా నిలబడ్డాడు. భారతీయ పునరుజ్జీవనం విషయంలో ఇద్దరి ఆలోచనలలో ఏకీభావం కుదిరింది. వెంకటరాయులునాయుడు పత్రికలలో సంస్కరణకు, వితంతువివాహాలకు అనుకూలంగా రాస్తూ వచ్చాడు. 1853లో 'రైసింగ్ సన్' (Rising Sun) పత్రిక స్థాపించి, హిందువుల