పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

దంపూరు నరసయ్య

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి రకరకాల పరీక్షలు నిర్వహించేవారు. నరసయ్య హయ్యరు గ్రేడు ట్రాన్సులేటరు పరీక్ష పాసయి “హుజూరు ట్రాన్సులేటరు” ఉద్యోగానికి అవసరమైన అర్హతలు సంపాదించాడు.13

మద్రాసులో సాంస్కృతిక పునరుజ్జీవనం

పందొమ్మిదో శతాబ్దం ఆరంభమయ్యేసరికి, మద్రాసు ప్రపంచనగరాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కార్యాలయాలు, ఆస్పత్రులు, మార్కెట్ ప్రదేశాలు ఏర్పడ్డాయి. మద్రాసు పెద్ద వాణిజ్యకేంద్రంగా ఎదిగింది. వ్యాపారవర్గాలు పెద్ద ఎత్తున మద్రాసుకు వలసవచ్చాయి. తెలుగుదేశం నుంచి 'కోమట్లు', ఇతర కులాలవారు తరలివచ్చారు.

1820 నాటికి మద్రాసులో ప్రతిసందులో ఒకవీధిబడి ఉండేది. సాధారణంగా తెలుగువారే ఈ బళ్ళు నిర్వహించేవారు. వీటిలో తెలుగు, తమిళం, లెక్కలు నేర్పేవారు. 1830 ప్రాంతంలో మద్రాసులో హిందూ లిటరరీ సొసైటీ ప్రారంభమైంది. ఈ సమాజంలో బ్రాహ్మణులు, ఇతర కులాలవారు సభ్యులు. చరిత్ర, సాహిత్యం, ఇతర సమకాలీన సమస్యలమీద ఉపన్యాసాలు, చర్చలు నిర్వహించేవారు. ఇదే సమయంలో వ్యాపారాలు, కులవృత్తులు కాపాడుకోడానికి కులసంఘాలు ఏర్పాటు అయ్యాయి. హిందువుల సాంఘికజీవనంలో అనేకమార్పులు వచ్చాయి. వాణిజ్య వ్యాపారాల్లో ధనం గడించి కొత్తగా సంపన్నులైనవారు ధర్మకార్యాలు చెయ్యడం మొదలుపెట్టారు. సత్రాలు పెట్టించారు, గుళ్ళు కట్టించారు, సంస్కృత పాఠశాలల నిర్వహణకు డబ్బు కర్చు చేశారు. పచ్చయ్యప్ప మొదలియారు ధర్మనిధి స్థాపన ఇందుకు ఒక ఉదాహరణ.

మొదట తటస్థంగా ఉన్న బ్రిటిష్ పాలకులు హిందూమత విశ్వాసాలలో జోక్యం చేసుకొన్నారు. క్రైస్తవ మిషనరీలను ప్రోత్సహించారు. మిషనరీలు మద్రాసు ప్రెసిడెన్సీలో అనేక ప్రదేశాల్లో చర్చిలు, పాఠశాలలు, అచ్చాఫీసులు పెట్టి మతప్రచారం చేశారు. విద్య వారి ప్రధాన కార్యరంగం అయింది. బ్రిటిష్ వారి అధికారం స్థిరపడుతున్న కాలంలోనే, మిషనరీల కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. వారు హిందువులను సంస్కరించడానికి మతాంతరీకరణ మార్గమని విశ్వసించారు. మతమార్పిడులు ఎక్కువ కావడంతో హిందువులకు, క్రైస్తవులకు నడుమ పెద్ద అఘాతం ఏర్పడింది.

1841లో మిషనరీలు మద్రాసులో కొంతమంది విద్యార్థులను క్రైస్తవమతంలోకి మార్చారు. ఈ సంఘటనతో హిందువుల అసమ్మతి తీవ్రరూపం ధరించింది. తమ బిడ్డలకు క్రైస్తవమతం ఇప్పిస్తారనే భయంతో, హిందువులు సొంత పాఠశాలలు