పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

దంపూరు నరసయ్య


దృష్టి సామాజిక, సంస్కరణ విషయాల మీద నుంచి దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితుల వైపు మరలింది. వందేమాతరం ఉద్యమంతో ప్రజల రాజకీయ చైతన్యం జాగృతమైంది.

ఆ కాలంలో ఆంధ్రప్రకాశిక, వివేకవర్ధని, దేశాభిమాని, సూర్యాలోకం, రసికజనోల్లాసిని, శశిలేఖ వంటి పత్రికలు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో ముందు నిలిచాయి. నెల్లూరు నుంచి వార్తా దర్శిని, ఆంధ్రదేశోపకారి, ఆంధ్రభాషా గ్రామవర్తమాని వంటి రాజకీయ వార్తాపత్రికలు వెలువడ్డాయి. బుచ్చిరెడ్డిపాళెంనుంచి శ్రీ వర్తమాన తరంగిణి మాసపత్రిక సాహిత్యానికి, వార్తలకు సమప్రాధాన్యాన్నిస్తూ వెలువడింది.16

ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో చర్చించబడిన విషయాలు

దారిడొంకలు లేని ఊళ్ళు

కోడూరు గ్రామాభివృద్ధికోసం, ఆ గ్రామసమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి పరిష్కరించడానికి పత్రిక ప్రారంభించినట్లు నరసయ్య పదే పదే చెప్పాడు. నరసయ్య ఊహలో ప్రతి ఊరికి ప్రధాన మార్గాన్ని కలుపుతూ మంచిరోడ్డు, చుట్టుపట్ల ఊళ్లను కలుపుతూ చక్కని బాటలు, ఊరూరా ఒక పాఠశాల, గ్రంథాలయం, పోస్టాఫీసు, పశువులకు, మనుషులకు వైద్య సౌకర్యం, గ్రామీణుల చిన్న చిన్న తగాదాలను తీర్చడానికి గ్రామ న్యాయస్థానం, బందెలదొడ్డి తప్పనిసరిగా ఉండాలి. గ్రామాణుల సౌకర్యాలను పట్టించుకోక పోవడం ఇంగ్లీషువారి పరిపాలనలో పెద్దలోపమని ఆయన భావించాడు.

గ్రామాలలో రోడ్లను గురించి నరసయ్య వివరంగా రాశాడు. “వేసవిలో తప్ప పల్లెటూళ్ళకు బండిలో ప్రయాణం చెయ్యడానికి బాటలు లేవు. రోడ్లు వెయ్యకుండానే ప్రభుత్వం రైతులవద్ద 'రోడ్డు సెస్సు' వసూలుచేస్తూంది. ఈ సెస్సులో పాతికోభాగం రైతులకిస్తే, వారే గ్రామాలకు రోడ్లు వేసుకొంటారు. గ్రామాలను ప్రధాన మార్గాలతో కలిపినప్పుడే అభివృద్ధి చెందుతాయి. గ్రామాలలో భూస్వాములు రైతులకు సహకరించడం లేదు. ప్రభుత్వం రైతులగోడు పట్టించుకోకపోతే, ప్రభుత్వానికీ భూస్వాములకూ తేడా ఉండదు” అని ఒక వ్యాసంలో హెచ్చరించాడు.17 వర్షాకాలంలో కోడూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా, ఊరుముంగిట ప్రవహించే వాగుమీద వంతెన నిర్మించాలని జిల్లా కలెక్టరును అభ్యర్థించాడు.

శ్రోత్రియం గ్రామాలు

నెల్లూరు జిల్లా శ్రోత్రియం గ్రామాల సమస్యలను విశ్లేషించి శ్రోత్రియం భూములను, మాన్యాలను ఆక్రమించుకొని అనుభవిస్తున్న భూస్వాములకు వ్యతిరేకంగా రాశాడు. సమర్థులైన అధికారులచేత శ్రోత్రియం గ్రామాలను తిరిగి సర్వేచేయించి, లెక్కలు తేల్చాలని,