పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

113


అందువల్ల ప్రభుత్వాదాయం పెరుగుతుందని సూచించాడు. “జిల్లా కలెక్టరుకు విలుకానిపల్లె ఎక్కడుందో తెలుసా? తెలియకపోతే, మేము వివరిస్తాము. నెల్లూరుకు పదిమైళ్ళ దూరంలో ఈ పల్లె ఉంది. కోడూరు రోడ్డు ఈ పల్లె మధ్యగా వెళ్తుంది. రోడ్డుపక్కనే ఉన్న ఈ పల్లె అభివృద్ధిని గురించి పట్టించుకోకుండా, ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం దురదృష్టం. ఊరికి రోడ్డుకు మధ్య పొలాలున్నాయి. పైరు పెట్టిన తర్వాత మనుషులు, పశువులు ఊళ్ళోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఈ ఊరి ప్రజలవద్ద ఎంతమొత్తం రోడ్డుసెస్సు వసూలు చేస్తున్నారు? ఇక్కడి ఇనాందార్లు తమ శ్రోత్రియాలను, మాన్యాలను అనుభవిస్తున్నారా? వారి పొలాలను ఎవరు ఆక్రమించుకొని సొంతం చేసుకొన్నారు? ప్రభుత్వం ఎన్నడైనా ఈ విషయాలు పరిశీలించిందా? ఇటీవలి సర్వేలో ఈ భూములను కొలిచి సక్రమంగా నంబర్లు ఇచ్చారా? సర్వేలో ఎంతభూమి మిగులు తేలింది? ఈ భూములను ఆక్రమించుకొని అనుభవిస్తున్న వారికున్న హక్కులేమిటి? ఈ వివరాలన్ని పరిశీలించి నిగ్గు తేల్చవలసిన అవసరంలేదా? ప్రభుత్వానికి నష్టం కలిగితే, ప్రజలకు నష్టంకాదా? మేము జిల్లా కలెక్టరును, తాసిల్దారును ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. ప్రజాశ్రేయస్సు, దేశహితం తప్ప, ఈ విషయాలు ప్రస్తావించడంలో మాకు వేరే ఉద్దేశాలు లేవు” అని విలుకానిపల్లె సమస్యలను వివరించాడు.18

“గ్రామాలలో దురలవాట్లు అధికం. గ్రామాణులు పశువులను ఇతరుల పొలాలలోకి, దొడ్లలోకి విడిచిపెడతారు. పశువులు పంటపొలాలను నాశనం చేస్తాయి. నీటి వసతి ఉన్నా వేసవిలో పైరు పెట్టుకొనే అవకాశం లేదు. ప్రతి గ్రామానికి ఒక బందెలదొడ్డి ఉండాలని” దాన్ని నిర్వహించే ఏర్పాట్లను కూడా నరసయ్య ఒక వ్యాసంలో చర్చించాడు. పశువుల వైద్యం కోసం అన్ని తాలుకాలకు వెటర్నరీ ఇన్‌స్పెక్టరులను నియమించాలని మరొక వ్యాసంలో సూచించాడు. రోగాలవల్ల పశుసంపద నశిస్తుందని, అందువల్ల వ్యవసాయాభివృద్ధి మందగిస్తుందని ఆ వ్యాసంలో వివరించాడు.19

గ్రామీణ పాఠశాలలు

నరసయ్య విద్యావేత్త. స్కూళ్ళ ఇన్స్‌పెక్టరుగా పనిచేసిన అనుభవం ఉంది. పల్లెటూళ్ళ చదువులను గురించి తన పత్రికలో తరచుగా చర్చించాడు. 500 పైబడిన జనాభా ఉన్న ప్రతి ఊరిలో ప్రభుత్వ పాఠశాల నెలకొల్పాలని, చిన్న చిన్న ఊళ్ళలో గ్రాంటు స్కూళ్ళు ప్రారంభించాలని, స్కూలు సెస్సు (school cess) వసూలుచేసి బళ్ళు నిర్వహించాలని సూచించాడు. కొన్ని వేలమంది విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకొని, పాండిత్యం సంపాదిస్తున్నారని ఒకవైపు సంతోషపడుతూ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు చదువుకోడంలేదని విచారం వ్యక్తం చేస్తాడు. బడికి వెళ్ళి చదువుకోవలసిన మగపిల్లలలో