పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

111


set up" (1901 June 25th)1' పత్రిక నిర్వహణలో సంపాదకుడు, విలేకరి, ప్రూఫ్‌రీడరు అన్నీ తానే అయి వ్యవహరించినట్లుంది. అనాటి చిన్న పత్రికలన్నీ ఇదే పద్ధతిలో కొనసాగాయి. నెలరోజుల క్రితం విడుదల కావలసిన సంచికను ఇంత ఆలస్యంగా సిద్ధం చేశాడంటే, పత్రికను తీసుకొని రావడంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అర్ధమవుతుంది.

పత్రికల దృక్పథంలో వచ్చిన మార్పు

చరిత్రకారులు స్వాతంత్ర్యోద్యమాన్ని స్థూలంగా మూడు దశలుగా గుర్తించారు. 1885 నుంచి 1905 వరకు మొదటి దశ. ఈ తొలిదశలో ఇంగ్లీషు విద్యాధికులైన మేధావులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు. పరిపాలనలోని లోపాలు సరిదిద్దితే చాలని భావించారు. ప్రజాచైతన్యాన్ని మేల్కొల్పి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపడానికి కృషి చేశారు. 1884లో మద్రాసు మహాజనసభ ఆవిర్భావం, భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడడం, జిల్లాసభలు ఏటేటా జరగడంతో మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం రగులుకొన్నది. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో పత్రికలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాయి.

కాంగ్రెసు దేశ ఆర్థిక విషయాల మీద దృష్టి నిలిపింది. దేశసంపద వృథా కాకుండా అడ్డుకోవాలని, ప్రభుత్వవ్యయం తగ్గించుకోవాలని, ప్రజల ఆర్ధిక పరిస్థితిమీద విచారణ జరపాలని కోరింది. అడవిచట్టాలు, ఉప్పుపన్ను, స్థానిక స్వపరిపాలన, బీళ్ళు, పచ్చికబయళ్ళు, నీటి వనరులు, అబ్కారి పన్ను మొదలైన సమస్యలమీద కాంగ్రెసు సమావేశాల్లో చర్చలు జరిగేవి. కరవుకాటకాల నుంచి విముక్తి కోసం అనుసరించవలసిన వ్యూహం, రైతుల పేదరికం, వారి దయనీయస్థితి ఇరవయ్యో శతాబ్దం ఆరంభమయ్యేసరికి కాంగ్రెసు సభలలో ప్రముఖంగా నిలిచాయి.

దాదాపు పై అంశాలే ఆనాటి భారతీయ పత్రికలలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఉన్నత పదవుల్లో భారతీయులకు అవకాశాలు లేకపోవడం, జాతివివక్ష, గ్రామీణ పేదరికం, ప్రభుత్వోద్యోగుల అవినీతి, పోలీసుశాఖ వైఫల్యం, ఆయుధచట్టం, న్యాయవ్యవస్థలో లోపాలు, కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలలో ప్రభుత్వాధికారుల పెత్తనం, లెజిస్లేటివ్ కౌన్సిళ్ళ పనితీరు, న్యాయవ్యవస్థను పరిపాలనావ్యవస్థ నుంచి విడదీయాలనికోరడం, న్యాయస్థానాల్లో మితిమీరిన జాప్యం , క్రైస్తవ మత ప్రచారకులకు ప్రభుత్వ ప్రోత్సాహం, మతమార్పిడి, భారతీయుల పేదరికం పట్ల ప్రభుత్వ ఉదాసీనత, ఆదాయంపన్ను విధానంలో లొసుగులు మొదలైన విషయాలు ఆనాటి పత్రికలలో ప్రముఖంగా చర్చించబడ్డాయి. పందొమ్మిదో శతాబ్ది ముగింపుకు వచ్చేసరికి విద్యావంతుల