పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

దంపూరు నరసయ్య


విద్యావిధానంలో ఆయన వ్యక్తిత్వం రూపొందింది. దక్షిణ భారతదేశంలో జమిందార్లు గర్వించదగిన వ్యక్తి, మంచి సాహిత్యాభిరుచి ఉన్నవాడు. తెలుగులో మహాకావ్యాలన్నీ చదివిన పాండిత్యం వృథాకాకుండా, ఆయన కొన్ని తెలుగు గ్రంథాలు ప్రచురించాడు. పదేళ్ళ క్రితం జమీందారీ పాలన చేపట్టిన తర్వాత, తన జమీందారీ రైతుల సంక్షేమం కోసం ప్రయత్నం చేశాడు కాని, అనేక కారణాలవల్ల ఆ ప్రయత్నం సఫలం కాలేదు.

చట్టసభలకు యోగ్యులయిన వారిని నియమిస్తున్నందుకు ప్రభుత్వాన్ని, మద్రాసు పౌరులను అభినందించక తప్పదు. ఒక లెజిస్లేటరుగా చెంచలరావు, సుబ్రహ్మణ్యఅయ్యరు వలె ఉపయోగకరంగా ఉంటాడని భావించలేముకాని, దక్షిణ భారతదేశ జమీందార్ల వ్యవహారాలను, ఆసక్తులను యువకుడైన ఈయన చక్కగా కాపాడగల సమర్థుడు.

ఉత్తముడైన రాజా జి.ఎన్. గజపతిరావుకు కౌన్సిల్లో స్థానం లభించకపోవడం విచారకరం. కౌన్సిల్లో ఖాళీలు ఏర్పడినపుడు గజపతిరావు నియామకం జరుగుతుందని ఆశిద్దాం. అవకాశం లభించినపుడు మద్రాసు స్థానిక వ్యాపారవర్గాల ప్రతినిధిని కూడా కౌన్సిలుకు నియమించాలి.”

6. ఉప్పు పన్ను వ్యాసం

1888 ఆరంభంలోనే ప్రభుత్వం దేశరక్షణ సాకుగాచూపి ఉప్పుమీద అదనంగా మణుగుకు ఎనిమిది అణాలు పన్ను విధించింది. ఈ సమస్యమీద చర్చించడానికి మద్రాసు పురప్రముఖులు ఫిబ్రవరి 14 తారీకు ప్రెసిడెన్సీ కళాశాలలో నార్టన్ అధ్యక్షతన సమావేశ మయ్యారు. నార్టన్ ప్రభుత్వ విధానాన్ని ఖండించి, ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఏదైనా చెయ్యాలని, అందుకు సంఘీభావం, ఆచరణ ముఖ్యమని ఉపన్యసించాడు. జి. సుబ్రహ్మణ్యఅయ్యరు మాట్లాడుతూ ఉప్పుపన్ను చరిత్రను వివరించాడు. ఆ సమావేశంలో భవిష్యత్కార్యాచరణకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. హిందూ రిపోర్టు చేసిన సభాకార్యక్రమాన్ని పీపుల్స్ ఫ్రెండ్ ఫిబ్రవరి 25 సంచికలో పునర్ముద్రించింది. ఇదే సంచికలో ఉప్పుపన్ను మీద వ్యాసం ప్రచురించబడింది. ఈ వ్యాసం అనువాదం :

“ఉప్పు పన్ను ఎక్కువ చెయ్యడం మీద ఇంగ్లీషు పత్రికలు మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. లండన్ టైమ్స్, ఇతర రేడికల్ పత్రికలు ఉప్పు పన్ను పెంచిన వార్తకు సంబంధించిన టెలిగ్రాములు ప్రచురించడం తప్ప మరేమి రాయలేదు. జీవించడానికి అవసరం కాబట్టి, ఉప్పుమీద పన్ను పెంచరాదని ఇప్పటికీ మేము భావిస్తున్నాము. ఈ చర్యవల్ల పెద్ద సంఖ్యలో నిరుపేద వర్గాలు కష్టాలపాలవుతాయి. ఉప్పు మనిషికి, పశువుకు అవసరం కనుక వ్యవసాయదారులు విపరీతమైన ఇబ్బందులు పడతారు. సరిహద్దురక్షణ, బ్రిటిషు సామ్రాజ్య రక్షణ అవసరంలేదని మేమనడంలేదు.