పుట:Dvipada-basavapuraanamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7

సంభావితుఁడ; భవిజనసమాదరణ
సంభాషణాది సంసర్గ దూరగుఁడ ;
నలిఁ బాల్కురికి సోమనాథుఁ డనంగ
వెలసినవాఁడ; నిర్మల చరిత్రుండ ;
నురుతర గద్య పద్యోక్తులకంటె
సరసమై పరఁగిన జానుఁదెనుంగు
చర్చింపఁగా సర్వసామాన్య మగుట :
గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱఁ :
దెలుఁగుమాట లనంగ వలదు : వేదముల
కొలఁదియ కాఁజూడు డిల నెట్టు లనినఁ : 170
బాటి తూమునకును బాటి యౌనేనిఁ
బాటింప సోలయుఁ బాటియకాదె !
అల్పాక్షరముల ననల్పార్థ రచన ;
కల్పించుటయె కాదె కవివివేకంబు !
అలరుచు బసవనిఁ దలఁచుతలంపు
బలుపునఁగాఁ జేసి భావమ్ము మెఱసి
యకలంక లింగ రహస్యసిద్ధాంత
సకల వేద పురాణ సమ్మతం బైన
యాతత సకలపురాతనభక్త
గీతార్ధసమితియే మాతృక గాఁగఁ 180
బూరితం బై యొప్పు పూసలలోన
దారంబుక్రియఁ బురాతన భక్తవితతి
చరితలలోపల సంధిల్ల బసవ
చరిత మే వర్ణింతు సత్కృతి యనఁగ ;
నసదృశలింగ దేహస్థుఁ డై యున్న
బసవని వేఱొక్కభావంబు గాఁగఁ
దగిలి వర్ణించుట ద ప్పనవలదు
తగు భక్తివర్ధనార్ధంబు దా నగుట.
బసవని శర ణన్నఁ బాపక్షయంబు ;