పుట:Dvipada-basavapuraanamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

బసవపురాణము

బసవని శర ణన్నఁ బరమపావనము ; 190
బసవని శర ణన్నఁ బ్రత్యక్షసుఖము ;
బసవని శర ణన్న భవరోగహరము ;
బసవని శర ణన్న భక్తి సేకూరు :
బసవని శర ణన్న బంధము ల్వాయు ;
బసవని శర ణన్న భాగ్యము ల్వొందు ;
బసవని శర ణన్నఁ బరఁగు శీలంబు ;
బసవని శర ణన్నఁ బాయు నాపదలు ,
బసవని శర ణన్నఁ బ్రబలు సంపదలు ;
బసవని శర ణన్న నసలారుఁ గీర్తి ;
బసవని శర ణన్న ఫలియించుఁ గోర్కి ; 200
బసవని శర ణన్న నెసఁగు వాక్సిద్ధి :
బసవని శర ణన్న భ్రాజిల్లు బుద్ధి ;
వే యేల తగ "బసవా” యనఁ బరఁగు
నీయక్షర త్రయం బిటు లొక్కమాటు
చదువు నెవ్వండేని ముదముతో నతని
వదనంబు శివునకుఁ గుదురు దా ననఁగఁ;
బాయక బసవనిఁ బ్రస్తుతించినను
బాయుట సోద్యమే భవబంధనములు !
బసవండు కేవలభక్తుఁడే తలఁప
నసమాక్షుఁ డారూప మై నిల్చెఁగాక ! 210
బసవఁడు వసుధపైఁ బ్రభవించు నంత
బసవని నరుఁ డని పలుకంగఁ దగునె ?
హరుఁడు నిరాకారుఁ డెనచో బసవఁ
డరయంగ సాకారుఁ డై చరియించు;
హరుఁడు సాకారుఁడై యలరుట సూచి
శరణుఁడై బసవండు సందు లేకుండు ;
శరణుఁ డై పరముండు సరి నెలకొన్నఁ
బరమభక్తస్థితి బసవన్న గొలుచు ;