పుట:Dvipada-basavapuraanamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

బసవపురాణము

సాదపాదోదకాస్వాద తత్పరుఁడు
గురుపరతంత్రుండు గొబ్బూరి విభుఁడుఁ
బరమశివాచారపథవర్తనుండు
లింగైక్యనిష్ఠావిలీనమానసుఁడు
సంగనామాత్యుండు జగదుపకారి
యని యిట్లు భక్తసభాభ్యంతరాళ
మున నిన్నుఁ జెప్పంగ వివి లసత్ప్రీతి
వనరింప జంగమభక్తుండ వనియు
బసవపురాణైకపాత్రుండ వనియు 140
నచలిత ప్రీతి మా కనుగులం బనియు
రచియింతు బసవపురాణసత్కవిత
యవధానవంతుండ వై నెమ్మి వినుము
సవిశేషభక్తిమై సంగనామాత్య !
ధర “నుమా మాతా పితా రుద్ర" యనెడు
వరపురాణోక్తి నీశ్వరకులజుండ ;
శరణగణాశ్రయ సకలస్వరూప
గురులింగవరకరోదరజనితుండ ;
భక్తకారుణ్యాభిషిక్తుండఁ, భాశ
ముక్తుండఁ, గేవల భక్తిగోత్రుండ ; 150
భ్రాజిష్ణుఁ డగు విష్ణురామిదేవుండుఁ
దేజిష్ణు వగు శ్రియాదేవి యమ్మయును
గారవింపఁగ నొప్పు గాదిలిసుతుఁడ ;
వీరమాహేశ్వరాచార వ్రతుండ ;
ఖ్యాత సద్భక్తిమైఁ గలకట్టకూరి
పోతిదేవరపదాంబుజషట్పదుండ ;
సకృపాత్ముఁ డగు కరస్థలి విశ్వనాథు
ప్రకటవర ప్రసాదకవిత్వయుతుఁడ;
వడగాము రామేశువరశిష్యుఁ డనఁగఁ
బడు చెన్న రాముని ప్రాణసఖుండ : 160