పుట:Dvipada-basavapuraanamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xli

పాండిత్యమును సార్థక మొనర్చుకొనెను. “బసవా! బసవా! వృషాధిపా!" యను మకుటమును, అష్టోత్తరశతసంఖ్యానియమమును పాటించిన ప్రప్రథమాంధ్రశతక మని దీనిని విమర్శకులు కీర్తించుచున్నారు. ఇందు యమకము, అనుప్రాసము, ముక్తపదగ్రస్తము మొదలగు శబ్దాలంకార వై చిత్రులను సోమనాథుఁడు గుప్పించివై చినాఁడు. శతకమున సందర్భానుసారముగా బసవేశ్వరుని యద్భుత మహిమలను మఱికొందఱు భక్తుల కథలను బొందుపఱచి శతకనామమును సార్థకపఱచినాఁడు. సోముని భక్తి పారవశ్యమున కీశతకము చక్కని యుదాహరణము

7. వీర శైవభక్తి సవైదికముగా వివరించుటకై ప్రామాణికస్తోత్ర గ్రంథమును నిర్మించుతలంపున "చతుర్వేదసార" మను 357 సీసపద్యముల లఘుకృతిని సోముఁడు రచించెను. దీనికి బసవలింగశతక మను నామాంతరము కలదు. ఇందు బసవశబ్దవిచారము, బసవ నామోచ్చారణ మహిమ, ప్రకృతి పురుషనామములు, అశుచినిరసనము, చరలింగస్తుతి; శీలలక్షణము, శివానుభవసూత్ర వివరణములు మొదలగు నంశములు బహుశ్రుతిస్మృతి ప్రమాణములతో నిరూపింపఁబడినవి. అతని వేద వేదాంగపారగత్వమున కీకృతి యొక తార్కాణము !

8. “చెన్నమల్లు" అను మకుటముతో సోముఁడు 32 సీసపద్యములను రచించెను. శ్రీశైల చెన్నమల్లికార్జునుఁ డతని యిష్టదైవ మనియు, బసవనిభక్తి కుదిరిన తరువాత నాతనినే బసవఁ డని భావించి యభేదభ క్తితో నీ పద్యములు సోముఁడు రచించె ననియు విమర్శకుల యభిప్రాయము. కల్కెములో జీవసమాధిగతుఁ డగునెడ సోమనాథుఁడు ముప్పదిరెండు సోపానములను గ్రమముగా నవరోహించుచు మెట్టున కొక్క పద్యము చొప్పున నీ సీసములు చెప్పె నని ప్రతీతి యొకటి కలదు. బసవేశ్వరుని మేనల్లుఁ డైన చెన్నమల్లు పేర నీ పద్యము లాతఁడు రచించె ననియు వాడుక కలదు. ముముక్షు వైన భక్తుని చిత్తసంస్కార మీ పద్యములందుఁ గానఁబడుచున్నది.

9. వీర శైవమతమునకు బ్రమాణ భాష్యగ్రంథములుగా సోమనాథుఁడు రెండింటిని వెలయించెను. 1. రుద్ర భాష్యము. ఇది యజుర్వేద