పుట:Dvipada-basavapuraanamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xl

3. సోమనాథుఁడు రచించిన సంస్కృతాంధ్ర బసవోదాహరణములు ప్రసిద్ధములై తత్సాహిత్యశాఖకవి ప్రథమము లై యాచార్యపీఠములుగా రాజిల్లుచున్నవి. విశిష్ట భక్తిస్ఫోరకము లగునట్లు విభక్తి ప్రత్యయములకు ప్రాధాన్య మిచ్చి నిర్మించు విచిత్ర భక్తికావ్య ముదాహరణకావ్యము. పద్యము, కళిక, ఉత్కళిక - అను వానిని క్రమముగా నొక్కొక్క విభక్తి యందును రచించి, సార్వవిభక్తిక శ్లోకము (సం) (పద్యము- తెలుఁగు) తోడను, అంకితాంక శ్లోకముతోడను నాయకునిఁ గీ ర్తించు లఘుకృతు లివ్వి. విద్యానాథుఁడితని సంస్కృత బసవోదాహరణమునే తన ప్రతాపరుద్రీయమున నుదాహరించెను. తెలుఁగు బసవోదాహరణమున నంకితాంకపద్యము కానరాదు. ప్రాచీనాంధ్రభాషా విశేషములు, ఛందో విభక్తిసంప్రదాయముల నెఱుంగుట కీ కృతులు భాషావేత్తల కుపయుక్తము లగుచున్నవి. సోమనాథుని ప్రసన్నభక్తి కవిత్వ మీకృతులయందు విభక్తుల నాశ్రయించి విశేషముగా జాలువారినది. ఉదాహరణమునకు; సార్వవిభక్తికము. (బ. ఉ.)

ఉ. నీవు దయాపయోనిధివి నిన్ను నుతించినఁ గల్గుఁ భక్తి నీ
     చే వరవీర శైవరతి చేకుఱు నీకయి యిత్తుఁ గబ్బముల్
     నీ వలనం గృతార్థత జనించును నీకు నమస్కరింతు నీ
     భావమునందునుండి నను బాయకుమీ బసవయ్య! వేడెదన్,

ఈమధ్య సోముని పండితారాధ్యోదాహరణమును డా॥ బి. రామరాజుగారు తొలిసారి వెలుఁగునకుఁ దెచ్చిరి. (సా. స. ప. 54. 3).

4. సోమనాథుఁడు పంచరత్నము లని ప్రసిద్ధి నందిన మాలినీవృత్త పంచకమును బసవపంచక మను పేర వెలయించెచు. అట్లే వసంతతిలక వృత్తములందు వృషభాష్టకమును, మాలినీవృత్తములలో బసవాష్టకమును గూడ రచించెను. ఇష్టభావలింగములను త్రివిధలింగముల నొక్కక్క దాని నెనిమిది అనుష్టుప్ శ్లోకములలో వర్ణించుచు మఱియొక సంస్కృత భక్తికృతి నొనర్చెను.

5. సోమనాథ స్తవ మనియు, భక్త స్తవ మనియు లఘుద్విపద స్తుతి కృతులు సోమనాథుని పేరు వినఁబడుచున్నవి,

6. సోమనాథుని వృషాధిపశతకము భక్తిరస శతకవాఙ్మయహారమున నాయక మణివలె వెలుగొందుచున్నది. అష్టభాషావిశారదుఁ డైన యీకవి సంస్కృతాంధ్ర ద్రవిడ కర్ణాటక మహారాష్ట్రార్యమణి ప్రవాళాది భాషలలో చంకోపత్పలమాలావృత్తములు రచించి బసవని గీర్తించి తనభాషా