పుట:Dvipada-basavapuraanamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxvi

బ్రజలను పరవశింపఁ జేయఁగలఁడు; పాండితీమండితము లైన రచనలచే పండితుల చిత్తములు పట్టగలఁడు. మెత్తగాఁ జెప్పవలసివచ్చినప్పుడు నాల్కను వత్తిగాఁ జేసి మతమార్గమున తేటమాటల వెలుఁగులు నింపఁగలఁడు. పరమతముల నొత్తవలసి వచ్చినప్పుడు డానాల్కనే కత్తిగా వాడి ప్రౌఢోక్తులతో పరసిద్దాంతఖండనము గావింపఁగలఁడు. ఆకాలమున నా మతము బ్రతుకుట కతఁడు కావలసివచ్చెను. అతఁ డామతముకొఱకే తన కలమును, కాలమును అంకితము చేసెను.

అరాధ్య సంప్రదాయము నాకళించుకొనిన యువసోమనాథునకు "ఏక ఏవరుద్రో న ద్వితీయాయతస్థే" ఇత్యాది శ్రుతివాక్యముల నన్వయించి శివతత్త్వ సార గద్య పద్య సమితిని నిర్మించి శివమహిమను లోకమునఁ జాటిన - మల్లికార్జునపండితుఁడే మనస్సున తత్త్వగురులింగ మై శివానుభవమును ప్రసాదించినాఁడు. ఆ అనుభవసారమే సోమనాథుని ప్రథమకృతి "అనుభవసారము. " అం దాతఁడు త్రికరణశుద్ధిగా పండితారాధ్యులను గీర్తించుచున్నట్లు మూఁడు సీస పద్యములలో నతనిని వర్ణించెను. (7-9) మఱియు...

క. అనుభవసారం బనఁగా
   మనసిజహరు శుద్ధభక్తి మార్గము వేదో
   క్తనిరూఢిఁ బురాణ రహ
   స్యనియుక్తిని విస్తరింతు నది యెట్లనిన్ ”. (30)

అని పండితారాధ్య మార్గమును పునరుద్ధరించెను. ఇట్టి పవిత్రకార్యము నతఁడు కావ్యరూపముగా నావిష్కరించుటకుఁ దగిన కవితాశశక్తినిఁ బ్రసాదించి ప్రోత్సహించిన కవితాగురువు కరస్థలము విశ్వనాథయ్య. అతనియెడఁ గల గురుభక్తిని కావ్యమునఁ బ్రదర్శించి సోముఁడు కృతకృత్యుఁడైనాఁడు. (33-34). గోడగి త్రిపురారి యీకృతికి నొడయఁడు (25). అతఁడు బహుశః సోమనాథునకు శివతత్త్వసారాది శైవమతగ్రంథ సంప్రదాయ రహస్యములను విప్పిచెప్పిన విజ్ఞాని యగుటచే నాతని కాతఁడు కృతిసమర్పణ మొనర్చియుండును .

ఇది 243 పద్యముల లఘుకృతి. గురుభ క్తిమహిమ, గురులింగ జంగమ శరణ ప్రసాదభక్తస్థలములు మొదలగు శైవమత సంబంధాంశము లిందు వర్ణింపఁబడినవి. ఇందు కందపద్యము లధికముగా నున్నను, సామాన్య వృత్తములతోపాటు త్రిభంగి, క్రౌంచపదము, తరువోజ, వనమయూరము మొదలగు