పుట:Dvipada-basavapuraanamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxv

సోమనాథుని కృతులు :

సోమనాథుఁడు మతోద్ధరణకై తన కవితాభక్తిని వినియోగించిన కవిశేఖరుఁడు. అతఁ డెంత భక్తకవియో అంత పండితకవి. వీరశైవమతోద్ధరణ కతని బసవభక్తి యెంత సహకారి యైనదో అతని పాండిత్య మంత యవసరమైనది. ఎట్లన: బసవేశ్వరుఁడు భక్తి ప్రధానమైన వీరశైవమును కర్ణాటక దేశమున వ్యాప్తిఁజేసినాఁడు. అందతఁడు భక్తిగీత సాహిత్యమును సృష్టించినాఁడు. పెక్కుమంది భక్తు లామార్గము ననుసరించి యా మత ప్రచారము చేయ మొదలిడిరి. కాని కాలము గడచినకొలఁది బసవనినాఁటి జిగి కాని బిగి కాని కర్ణాటముననే కానరాలేదు. అట్లుండ ఆంధ్రదేశము మాటయేమి ? ఇచ్చట వేంగీప్రాంతములందు వైదికము పునర్విజృంభణము చేసినది. భారతము వెలసినది. రాజసభలలో, పండితపరిషత్తులలో వాదసదస్సులలో వైదికమతము పరమతములను తన పాదాక్రాంతముల నొనర్చుకొనుచున్నది. ఇట్టి తరుణమున పండితారాధ్యాదు లాంధ్రమున బ్రాహ్మ్యమును వీడక , వేదపారగత్వమును భజించి శైవమునకు వేదపురాణేతిహాసశాస్త్ర ప్రమాణవాదబలమును సిద్ధపఱచు పండితమార్గముఁ దీర్చిదిద్దియున్నారు. మతము బ్రతుకవలె నన్నచోఁ బ్రజల మనస్సు లందును బుద్ధు లందును విశ్వాసము పడయవలెను. సంఘ మనస్థ్సానీయు లైన సామాన్య ప్రజ భక్తికి వశమై, మహిమలకు ముగ్ధ మై విశ్వాసమును బెంచుకొనవచ్చును. కాని సంఘబుద్ధిస్థానీయ మైన మేథావివర్గము మాత్రము కర్కశతర్క పరీక్షలకు నెగ్గి, బుద్ధి వికాసము నిచ్చెడి జ్ఞానమతమునే గౌరవించుచుండును. వారికి భక్తి ప్రథమసోపానము ; జ్ఞానము ఉత్తమసోపానము. భక్తితో ప్రజల నాకర్షించిన వీరశైవము పండితుల నాశ్రయించి జ్ఞానపుష్టిని గాంచు పద్ధతి తెలుఁగునాట వ్యాపించినది. దాని కాలంబన మైనదే ఆరాధ్య సంప్రదాయుము. ఇది బసవేశ్వరుని వెన్నంటి పరమేశ్వరుని సన్నిదానమున కేఁగిన పండితారాధ్యుల తరువాత నాంధ్రమునఁ గొంత మందగించినది. దానికి తిక్కన సోమయాజి వైదికనిష్ఠ మగుమహాకవిత్వోద్యమము, ఓరుగల్లున నతఁడు సాధించిన మతవిజయము మొదలగునవి బలమైన కారణములు . యథావాక్కుల అన్నమయ్య వంటి కవులు కొందఱు గొంతెత్తి శైవకవిత్వ మాలపించినను మతమునకు బలము చాలలేదు. దానితో నటు పండితులలో నిటు పామరులలో వీరశైవము నిలువద్రొక్కు కొనునట్లు చేయవససిన భారము సోమునిపైఁ బడినది. అతఁడు భక్తి కవితచేఁ