పుట:Dvipada-basavapuraanamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xx

బసవపురాణ పండితారాధ్య చరిత్రలందు ప్రధానముగా సంస్కృత సమాస భూయిష్ఠమైన యోజోబంధమును గర్హించెను. కావున తత్సమ, తద్భవ, దేశ్యాది భేదముచే నొప్పారు తెనుఁగు పదజాలమున నతఁడు తత్సమ వై రళ్యమును , దేశ్యబాహుళ్యమును , ఉక్తిసారళ్యమును వరించె ననియు, నట్టి లక్షణముల సంయోజనరూప మైన రచనమే జానుఁదెనుఁ గనియు, నది సర్వజన సామాన్య మనియు సోమనాథుఁడు భావించె నని తలంప వచ్చును.

తెలుఁగుముద్ర:

దేశిరచనా సంప్రదాయము నుద్ధరించిన సోమనాథుఁడు జానుఁదెనుఁగున ద్విపదకావ్యములు రచించి తెలుఁగు దనమును పోషించె నని కీ. శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగా రిట్లు పేర్కొనిరి. “తెలుఁగుసకుఁ దోడిభాష యగు ద్రవిడభాషలో దేశిరచన లెక్కువగా నెక్కొన్నవి. ద్రవిడదేశీయు లగు జైనులయు, శైవులయు, వైష్ణవులయు దేశిచరిత్రములు ద్రవిడభాషా సహజము లగు దేశి వృత్తములలో రచితము లై వెలసియున్నవి. కర్ణాటకమున నంతగా నట్టి రచనలు లేవుగాని తెలుఁగున కంటెఁ గొంత హెచ్చుగా నున్న వనవచ్చును. ఆదికాలమునఁ దెనుఁగు గ్రంథములు ప్రాయికముగా సంస్కృతభాషలో నున్న పురాణా ద్యార్యగ్రంథముల కనువాదములుగానే వెలయుటచే నాంధ్రసహజము లైన దేశిరచనల కాదరువు సన్నగిల్లెను. మన పూర్వులు పౌరాణికము లయిన యార్య కథల మీఁదను, సంస్కృతచ్ఛందస్సు మీఁదను, సంస్కృతప్రాయ మయిన తత్సమభాష మీఁదను నభిమానము గలవారయి దేశీయేతివృత్తములను, దేశీయ చ్ఛందస్సులను, దేశిభాషను జితుకఁద్రొక్కిరి. నేఁడు మనము స్త్రీపామరాదుల గేయరచనము లని యనాదరమునఁ జూచు పదరచనముల వరుసలే ద్రవిడభాషలోని ప్రౌడకావ్యములందలి వృత్తములుగా నెలకొన్నవి. తరువోజ, ద్విపద, రగడ. అక్కర. గీతి, సీసము మొదలగు పరిమితజాతులే దేశిచ్ఛందో జనితములు మనగ్రంథములం దాదృతము లయ్యెను, ఈ దోషముచే మన తెలుఁగు ప్రబంధములం దాంధ్రతాముద్ర యంతగాఁ గానరాకున్నది. కొంతవఱ కాంధ్రతా

ముద్ర నచ్చొత్తి ప్రబంధముల రచించిన వారిలో నగ్రగణ్యుఁ డీ సోమనాథ కవియే. ఈతఁడు దేశీయ కథలను దేశిచ్ఛందోజనిత మగు ద్విపదమున దేశి తెనుంగు బాసలో రచించినవాఁ డగుటచే నీతని కవితలో నాంధ్రతాముద్ర సక్కగా నత్తికొనెను".[1]

  1. బసవపురాణము. (ఆంధ్ర గ్రంథమాల) - వీఠిక పుట 54-55.