పుట:Dvipada-basavapuraanamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xix

“చ. బలుపొడతోలు సీరయును బాఁపనరుల్ గిలుపారు కన్ను వె
 న్నెలతల నేఁదుఁగుత్తుకయు నింపిన వేలుపు టేఱు వల్గుపూ
 సలు గల ఱేని లెంక వని జానుఁదెనుంగున విన్నవించెదన్
 వలపు మదిన్ దలిర్ప బసవా బసవా బసవా వృషాధిపా ! "

ఇందుఁ దత్సమపద విరహిత మైన తేట తెనుఁగు కలదు. దీని నచ్చ తెనుఁగని మనము పిలిచెదము. కావున జానుఁదెనుఁ గనఁగా నచ్చతెనుఁగనియే యొకరు భావించిరి. ఒకరు 'సొంపైన తెనుఁగనిరి. మరియొకరు 'సర్వ సామాన్యమగు ప్రపన్నమైన తెనుఁగనిరి.[1] మరియొకరు కేతన ఆంధ్రభాషా భూషణములో నచ్చతెనుఁగునకును, దేశికి నిచ్చిన యుదాహరణములను బోల్చి చూచి జానుఁదెనుఁగునకును వానికిని భేదము లే దనిరి.[2] ఇంకొకరు కన్నడ కవులు పేర్కొనిన “పొసదేసె” “జాణ్‌నుడి " వంటిది జానుఁదెనుఁ గనియు, “జాణత్వముతో చమత్కార యుక్తముగాఁ బ్రయోగింపఁబడిన తెనుఁ గని యర్థము చెప్పవచ్చు ననియు నూహించిరి.[3] ఇంకొకరు “జానుదెనుఁగునందు సంస్కృతపదములు లేకుండ నుండవలయు ననికాదు. దేశీయపదము లధికముగా నుండుటయు, సంస్కృతపదములు మృదువులును సులభములునై యుండుటయు జానుఁదెనుఁగు కవిత్వ లక్షణ' మనియు నెఱిఁగించిరి.[4] ఇట్లు జానుఁదెనుఁగును గూర్చి పండితులు బహువిధములుగా భావించుచుండుటచే దాని నిదమిత్థ మని తేల్చి చెప్పుటకు వీలు లేకున్నది. జానుఁదెనుఁగున కవిత్వము వ్రాసెద నని సోమనాథుడు చేసిన ప్రతిజ్ఞకు బసవపురాణ పండితారాధ్య చరిత్రములు లక్ష్యములు కావలసియుండఁగా పై పద్య మొక్కటి మాత్రమే దానికి

సమగ్రోదాహరణము కాఁజాలదు. ఏలయన బసవపురాణము పై పద్యమువలె నచ్చతెనుఁగున వ్రాయఁబడలేదు. అట్లని అందలిది జానుఁదెనుఁగు కాదనుట కవి ప్రతిజ్ఞకు విరుద్ధము. కావున వీనిని సమన్వయింపవలెను. సోమనాథుఁడ

  1. కుమారసంభవము -- (మద్రాసు విశ్వవిద్యాలయ ప్రచురణము. 1948) పీఠిక సంపాదకులు : శ్రీ కోరాడ రామకృషయ్య, యన్. లక్ష్మీపతి శాస్త్రి గారలు - పు 29-30.
  2. నన్నెచోడుని కవిత్వము - శ్రీ వేదము వేంకటరామశాస్త్రిగారు, పుట 109-11
  3. కుమారసంభవము. (మ. వి. ప్ర.) పీఠిక. పుట 30.
  4. ఆంధ్రకవితరంగిణి. శ్రీ చాగంటి శేషయ్యగారు. సంపుటము 13, పుట 104.